ఘనంగా వెదురుపాక గాడ్ జన్మదిన వేడుకలు..

విజయదుర్గా పీఠాధిపతులు శ్రీ వెదురుపాక గాడ్ బోధనలు అవశ్య మనుసరణీయాలని విజయ దుర్గా ఉపాసకులు డాక్టర్ చెప్పెల హరినాథశర్మ అన్నారు

నిస్వార్థమైన భక్తి ఫరోపకారపరాయణత్వం దైవాన్ని చేరుకోవడానికి సులువైన మార్గాలని ఆయన అన్నారు

తూర్పు గోదావరి జిల్లా వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతులు వెదురు పాక గాడ్ జన్మదిన వేడుకలు కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శుక్రవారం నాడు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి మాట్లాడుతూ నిరంతరం ఇతరుల మేలును కోరుకోవడమే మానవుడు ఆచరించవలసిన ధర్మమని వెదురుపాక గాడ్ సందేశమన్నారు.ఉదయం 6 గంటలకు శ్రీ విజయదుర్గా మాతకు విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించారు అనంతరం 10 గంటల నుండి రాహుకాలార్చన జరిగింది.ఈ సందర్భంగా 27 నక్షత్రాలు 12 రాశులకు సంబంధించిన మొక్కలను క్షేత్రం ఆవరణలో నాటారు.

*సామాన్య భక్తుడికి విజయదుర్గా ధార్మిక పురస్కారం*

విజయదుర్గా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి యేటా ఉత్తమ ధార్మిక సేవలకు అందించే విజయదుర్గా ధార్మిక సేవా పురస్కారం 2024 సంవత్సరానికి గాను పొన్నాల దత్తాత్రేయ ఆశ్రమం వ్యవస్థాపకులు నల్ల సాయిలుకు అందజేశారు.అతిసామాన్య జీవనం గడుపుతూ నిష్కళంక భక్తితో దత్తాత్రేయ ఆశ్రమం నడిపిస్తున్నందుకు ఈ పురస్కారం అందిస్తున్నట్లు డాక్టర్ చెప్పెల హరినాథశర్మ తెలిపారు.సొంత వ్యవసాయ భూమిలో ఆశ్రమం నెలకొల్పి ఇరవై ఏళ్ళుగా సాయిలు సేవలందిస్తున్నారని చెప్పారు.ఉన్నతవిద్య,ధనసంపత్తి పలుకుబడి లేకపోయినా నిష్కల్మషమైన భక్తితో దైవ కృప పొందవచ్చునని అసంఖ్యాకమైన భక్తులు చరిత్రలో నిరూపించారన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణా కమిటీ సభ్యులు చీకోటి మల్లికార్జున్ గట్టు విఠల్ మోహన్ దాస్ నరసింహా రెడ్డి మల్లేశం తిరుపతి రెడ్డి మర్యాల వీరేశం తదితరులు పాల్గొన్నారు