Headlines

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణలో తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ..

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఫిబ్రవరి 23, 2024:

 

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణలో తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు.

 

శుక్రవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై చీప్ సూపరింటెండెంట్స్, ఇన్విజిలేటర్స్, రూట్ ఆఫీసర్స్, లైజాన్ ఆఫీసర్స్, అబ్జర్వ్ లతో సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ ఆదివారం జిల్లాలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు 37 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భీమవరం-21, నరసాపురం-3, తాడేపల్లి గూడెం-13 సెంటర్లును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఆఫ్ లైన్ లో నిర్వహించనున్న పరీక్షలకు 14,546 మంది హాజరుకానున్నారని, ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పరీక్షలను నిర్వహణకు సమన్వయ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి ని నియమించినట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహణకు 37 మంది చొప్పున లైజాన్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, జిల్లా అధికారులను 17 మందిని రూట్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, పూర్తిగా తనిఖీ చేసిన మీదటే పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతించాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ సెంటర్లను తప్పక మూసివుంచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి, తగినంత మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు, దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక రూమును ఏర్పాటు చేసి పరీక్షలను నిర్వహించవలసిందిగా సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడడంతో పాటు, జనరేటర్లు ఏర్పాటుకు పర్యవేక్షించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు వెళ్ళుటకు, తిరిగి గమ్యాలకు చేరుటకు అభ్యర్థులకు అనువుగా ఆర్టీసీ బస్సులు రూట్ మ్యాప్ లు సిద్ధం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో ఐడి తో పాటు నిర్దేశించిన గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి ఉదయం 9:30 గంటల నుండి 10.15 గంటల లోపు హాజరు కావాలన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులను బయటికి పంపడం జరగదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్లు, ట్యాబ్, ఐప్యాడ్, హ్యాండ్ బ్యాగ్స్ తో పాటు ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించడం జరగదని తెలిపారు. అభ్యర్థి ఓఎంఆర్ షీట్ మీద హాల్ టికెట్ నెంబర్ బబుల్ చేయాల్సి ఉంటుందని వివరాలను పరిశీలించిన మీదటే ఇన్విజిలేటర్ ఓఎంఆర్ షీట్ పై సంతకం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు భీమవరం కె.శ్రీనివాసులు రాజు, తాడేపల్లిగూడెం కె.చెన్నయ్య, ఏపిపియస్సి సెక్షను అధికారి జె.జయంతి, ఏయస్ వో ఏ.నాగ లక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.వెంకట రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి మహేశ్వర రావు, జిల్లా రవాణాశాఖ అధికారి టి.ఉమామహేశ్వర రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.కె మురళీ కృష్ణ, జిల్లా గృహా నిర్మాణ శాఖ ఇఇ బి.వెంకట రమణ, జిల్లా ఆర్డబ్ల్యూయస్ అధికారి ఏ. రామస్వామి, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి జి.గణపతి రావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె.శోభారాణి, జిల్లా ఐసిడియస్ అధికారి బి.సుజతా రాణి, జిల్లా ట్రైబల్ అధికారి డి. పుష్పరాణి, డియల్డివో ఏవి. అప్పారావు, జిల్లా కలెక్టరు కార్యాలయం పరిపాలనా అధికారి పిహెచ్ జిఆర్ పాపారావు, తహాశీల్దార్లు, యంపిడివోలు, డిప్యూటీ తహాశీల్దార్లు, ఈవోపియార్డిలు, ప్రైవేటు కళాశాలలు, ఇంజనీరింగు కళాశాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.