Headlines

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాపై అందరి ఆసక్తి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాపై అందరి ఆసక్తి నెలకొని ఉంది. ఈ మూవీ అఫీషియల్ టైటిల్ ఏంటనే దానిపై చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి.

గ్లోబల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రాజెక్ట్ కే సినిమాను హాలీవుడ్ రేంజ్‍లో తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ప్రముఖ హీరో కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దీశా పఠానీ ఈ చిత్రంలో నటిస్తున్నారు. కాగా, ప్రాజెక్ట్ కే సినిమా గ్లింప్స్ రిలీజ్ తేదీని నేడు ప్రకటించింది చిత్ర యూనిట్.

అమెరికాలో జూలై 20వ తేదీన ప్రాజెక్ట్ కే గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ నేడు ప్రకటించింది. అయితే, భారత కాలమానం ప్రకారం గ్లింప్స్ విడుదల సమయానికి ఇండియాలో జూలై 21 వస్తుంది. “అల్టిమేట్ షోడౌన్ కోసం ప్రపంచం వేచిచూస్తోంది. జూలై 20 (అమెరికా), జూలై 21 (ఇండియా) తేదీన ప్రాజెక్ట్ కే ప్రపంచాన్ని చూసేందుకు గ్లింప్స్ కోసం సిద్ధంగా ఉండండి” అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‍లో అడుగుపెట్టనున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కే చరిత్ర సృష్టించనుంది. ఈ ఈవెంట్‍లోనే జూలై 20న ప్రాజెక్ట్ కే అఫీషియల్ టైటిల్, గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేస్తుందని గతంలోనే అంచనాలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. కాలిఫోర్నియాతో పోలిస్తే భారత్‍లో టైమ్ పన్నెండున్నర గంటలు ముందు ఉంటుంది.

కాగా, జూలై 20న సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‍కు హీరో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ హాజరుకానున్నారని వైజయంతి మూవీస్ ఇటీవలే ప్రకటించింది. అలాగే, దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ ఈవెంట్‍కు వెళతారని తెలుస్తోంది.

ప్రాజెక్ట్ కే టైటిల్‍పై ఇప్పటికే కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ టైటిల్ కాలచక్ర అంటూ పుకార్లు వస్తున్నాయి. కురుక్షేత్ర, కల్కి అనే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఉత్కంఠకు సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‍లో తెరపడనుంది. ఈ ఈవెంట్‍లో ప్రాజెక్ట్ కే అఫీషియల్ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సీహెచ్ అశ్వినీదత్.. ప్రాజెక్ట్ కే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.700కోట్లకు పైగా బడ్జెట్‍తో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రాజెక్ట్ కే చిత్రం విడుదల కానుంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని తెలుస్తోంది.