కర్ణాటకలో హై అలర్ట్, ర్యాలీలు, రవ్వ దోసె అంటే రఫ్ ఆడిస్తామని ఫైనల్ వార్నింగ్!

బెంగళూరు/మంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం కన్నడిగులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు కర్ణాటక మొత్తం ముందు జాగ్రత్తలో భాగంగా నిషేదాజ్ఞలు విదిస్తున్నామని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మే 10వ తేదీన ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇళ్లల్లో, రిసార్టుల్లో సేద తీరుతున్న పలు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం మాదే అంటూ ధీమాగా ఎంజాయ్ చేస్తున్నారు. గురువారం, శుక్రవారం నాయకులు ఎలా ఉన్నా శనివారం మాత్రం కౌంటింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యక్షం అవుతారని అధికారులు గుర్తించారు.

పోలింగ్ కేందాల్లో వివిద పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు ఎలాంటి హంగామా చెయ్యకుండా పోలీసు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక మొత్తం మే 13వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్దరాత్రి వరకు నిషేదాజ్ఞలు విదిస్తున్నామని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. మే 13వ తేదీన బెంగళూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో బాణాసంచా కాల్చడం, ఊరేగింపులు చెయ్యడం, ధర్నాలు, ర్యాలీలు చెయ్యడం నిషేధించామని బెంగళూరు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని పలు సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎవ్వరూ గుమికూడకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఎవరు ఎన్ని చెప్పినా పోలింగ్ కేంద్రాల దగ్గర నుంచి విజయం సాధించిన అభ్యర్థులు ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరడానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు.