Headlines

భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్

ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు వ్యాపారాలను టాటా గ్రూప్ కలిగి ఉంది. దేశంలో పురాతనమైన వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఉన్న టాటాలు సమాజానికి సంపదను తిరిగి ఇచ్చేందుకు తమ లాభాలను వినియోగిస్తుంటారు.

ఈ క్రమంలో భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ తన స్థానాన్ని నిలుపుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం టాటా గ్రూప్ 26.4 బిలియన్ డాలర్ల విలువతో అత్యంత విలువై బ్రాండ్ గా నిలిచింది. ఇదే క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. కరోనా తర్వాత అనిశ్చిత రాజకీయ భౌగోళ పరిస్థితుల్లో దేశంలోని టాప్-100 అత్యంత విలువైన బ్రాండ్‌లు సమిష్టిగా వృద్ధిని ప్రదర్శించాయి.

టాటా గ్రూప్ బ్రాండ్ విలువ గత సంవత్సరంతో పోలిస్తే 10.3 శాతం పెరిగి 26.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంత అత్యధిక విలువను సాధించిన మెుదటి కంపెనీ ఇది. ప్రపంచ వ్యాప్తంగా టాప్-500 కంపెనీల జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ బ్రాండ్ గా టాటా గ్రూప్ నిలిచింది. సాంకేతిక వినియోగంత ద్వారా గత రెండేళ్లలో టాటా గ్రూప్ వ్యూహాత్మక పరివర్తనకు గురైందని బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ సావియో డిసౌజా తెలిపారు.

ఇదే క్రమంలో దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ అనిశ్చితుల మధ్య రెండవ స్థానాన్ని కొనసాగించింది. ఇదే సమయంలో మహీంద్రా గ్రూప్ టాప్-10 అత్యంత విలువైన బ్రాండ్‌ల జాబితాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో మహీంద్రా గ్రూప్ 7 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఏడవ స్థానంలో నిలిచింది. రూ.1,21,269 కోట్ల రాబడిపై తొలిసారిగా రూ.10,000 కోట్లను అధిగమించి రికార్డు లాభాలతో గత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ అసాధారణమైన పనితీరును కనబరిచింది.