ఆ చట్టాన్ని రద్దుచేస్తాం: చంద్రబాబు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వివేకా హత్య కేసులో తప్పించాలని, కోర్టులో మేలు జరగాలని దేవాదాయశాఖ మంత్రి పూజలు చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐ-టీడీపీ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ఐ-టీడీపీ ఆర్గనైజేషన్‌ పనితీరు బాగుందని కొనియాడారు.

ఏ సందేశమైనా కార్యకర్తలకు వెంటనే చేరిపోతోందని, ఐటీడీపీ కృషివల్లే 21 లక్షల మంది సభ్యత్వం నమోదైందని ప్రశంసించారు. సమాచారాన్ని ఎవరైతే వేగంగా చేరవేస్తారో వారే విజేతలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేసే విధానం మారుతోందన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న మహిళలకు ఆడబిడ్డ నిధి ప్రకటించామని, అమ్మకు వందనం పథకం కింద రూ.1500 అందిస్తామన్నారు. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతోందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు.

అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, సంపద సృష్టించి అందరికీ ఉద్యోగాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం ఒక్కటేనని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందిస్తామని, సంపదను సృష్టించడానికి పీ-4 నమూనా తీసుకువస్తామని, ప్రతి పేదవాణ్ని ధనికుణ్ని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. ప్రతి మతానికి కొన్ని సంప్రదాయాలుంటాయని, వాటిని దెబ్బతీసేలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. ఆర్థిక శాఖ మంత్రి రైతుబజారును కూడా తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని, విద్యాశాఖ మంత్రి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని, వైసీపీలో మొత్తం జోకర్లే ఉన్నారన్నారు.