Headlines

ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 25 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

వారణాశి- ఢిల్లీ మధ్య మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టింది. క్రమంగా విస్తరించింది. న్యూఢిల్లీ-కాట్రా, ముంబై సెంట్రల్-గాంధీనగర్, న్యూఢిల్లీ- అందౌరా, బిలాస్‌పూర్- నాగ్‌పూర్ జంక్షన్, హౌరా- న్యూజల్‌పాయ్‌గురి, సికింద్రాబాద్-విశాఖపట్నం, ముంబై-సాయినగర్ షిర్డీ, ముంబై-షోలాపూర్.. మధ్య ఈ రైళ్లు తొలిదశలో పట్టాలెక్కాయి.

మలి విడతలో భోపాల్- ఢిల్లీ, సికింద్రాబాద్- తిరుపతి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- కోయంబత్తూర్, ఢిల్లీ కంటోన్మెంట్- అజ్మీర్, తిరువనంతపురం సెంట్రల్- కాసర్‌గాడ్, పూరీ-హౌరా, ఆనంద్ విహార్ టెర్మినల్- డెహ్రాడూన్, న్యూజల్‌పాయ్‌గురి- గువాహటి, ధార్వాడ-బెంగళూరు, పాట్నా-రాంచీ, భోపాల్- ఇండోర్, భోపాల్- జబల్‌పూర్, ముంబై- గోవా, గోరఖ్‌పూర్- లక్నో, అహ్మదాబాద్- జోధ్‌పూర్ మధ్య నడుస్తోన్నాయి.

వైఎస్సార్ జయంతి నాడు షర్మిల కీలక ప్రకటన..!!

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరిన్ని పట్టాలెక్కడానికి సన్నద్ధమౌతోన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోన్నాయి. ఇప్పటివరకు నీలం- తెలుపు రంగు కాంబినేషన్‌లో మెరిసిపోతూ కనిపించిన వందే భారత్ ఎక్స్‌టీరియర్.. కొత్త రంగులను అద్దుకుంటోన్నాయి.

ఆరెంజ్- డార్క్ గ్రే కలర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్నాయి. ఇకపై పట్టాలెక్కబోతోన్న కొత్త వందే భారత్ రైళ్ల కోచ్‌లన్నీ కూడా ఆరెంజ్- డార్క్ గ్రే కలర్‌లోనే ఉండొచ్చని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై చక్కర్లు కొడుతున్నాయి.

ఈ కొత్త రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు ఉండబోతోన్నాయి. సీటింగ్ మరింత లగ్జరీగా ఉంటుంది. కిటికీల విస్తీర్ణత మరింత పెరుగుతుంది. కోచ్ లోపలి భాగాలు మరింత విశాలంగా ఉంటాయని చెబుతున్నారు. కొన్ని రైళ్ల బోగీలను కూడా పెంచే ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.

ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో- అటు కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సహా మిగిలిన అన్ని రైళ్లల్లోనూ ఏసీ ఛైర్ కార్ ధరలను తగ్గించింది. 25 శాతం మేర కుదించింది. వందే భారత్ సహా ఏసీ ఛైర్ కార్లు అందుబాటులో ఉన్న అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది.