జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం..

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఫిబ్రవరి 9:

ఆరోగ్య సంరక్షణలో భాగంగా నులి పురుగుల నిర్మూలనకు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను ఇప్పించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి తెలిపారు శుక్రవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా స్థానిక పురపాలక సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులకు జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. అనంతరం బాలికలతో జిల్లా కలెక్టరు కొద్దిసేపు ముచ్చటించారు. ఆల్బెండజోల్ మాత్రలు వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, గతంలో మీరంతా వేసుకున్నారా, మీతో పాటు మీ కుటుంబలో ఉన్న సోదర, సోదరీమణులకు, ఇంటి పక్కన ఉన్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించే భాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టరు సూచించారు. జిల్లాలో అంగన్వాడి పిల్లలు 51,649 మంది, ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు 2,35,711 మంది, ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ మొదటి సంవత్సరం వరకు 38,025 మంది మొత్తం 3,25,385 మందికి ఉన్నారని, ఏ కారణం చేతనైనా దూర ప్రాంతాలకు వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నట్టయితే అటువంటి వారిని గుర్తించి ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం మాత్రలను అందించుటకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టరుకు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణలో భాగంగా ఒకటి నుండి 19 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు తప్పక వేసుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలు, కళాశాలు, అంగన్వాడీ కేంద్రాలకు, వివిధ వసతి గృహాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయుటకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కడుపులో నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవు తారని, అపరిశుభ్రత చేతుల ద్వారా ఆహారం తీసుకుంటే లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారని ఆమె అన్నారు. ఆహారం తీసుకునే సందర్భాల్లో ఖచ్చితంగా విద్యార్థులు శుభ్రతను తప్పక పాటించాలన్నారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీనత, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. అల్బెండో జోల్ మాత్రలతో వీటికి చెక్ పెడుతుందని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.శ్రీనివాసులు రాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.డి మహేశ్వర రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.వెంకట రమణ, పురపాలక సంఘం కమీషనరు యం.శ్యామల, తహాశీల్దారు యల్. శివ కుమార్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానో పాధ్యాయులు జె.సుధారాణి, వైద్యాధికారులు, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, వార్డు సచివాలయ సిబ్బంది, ఆశావర్కర్లు, వార్డు వాలంటీర్లు, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.