కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడు ఫలితం వెలువడ్డ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ కోసం పోరాడిన కార్యకర్తలను ఆయన అభినందించారు. ”ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే.. ఇచ్చిన హామీలను 15 రోజుల్లో నెరవేరుస్తామన్నారు.

హామీ ఇచ్చినట్లుగా సీఎం కేసీఆర్ 15 రోజుల్లో వాటిని నెరవేర్చాల్సిందే. గెలిచిన తర్వాత ఆ విషయం చెప్పకుండా అహంకారంతో మాట్లాడుతున్నారు. ఒక ఉప ఎన్నికలో గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారు. ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరితే పదవులకు రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరుతున్నాం. ఇతర పార్టీల నుంచి గెలిచిన 12 మందిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరే దమ్ముందా? మునుగోడు గెలుపు టీఆర్ఎస్‌దా.. కేటీఆర్‌దా.. లేక హరీష్ రావుదా? కమ్యూనిస్టులదా? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిదా? ఎవరిదో చెప్పాలి.