కామారెడ్డి : రైతులని తప్పుదోవ పట్టిస్తున్నారు.. భూములు పోతాయన్న భయం వద్దు

మాస్టర్ ప్లాన్ అంశం…. కామారెడ్డి జిల్లాలో పెద్ద దుమారాన్నే రేపుతోన్న నేపథ్యంలో.. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమేనని.. ఇందులో మార్పులు, చేర్పులు జరుగుతాయని చెప్పారు. కొత్త ప్లాన్ తో భూములు పోతాయని కొందరు పదే పదే చెబుతూ రైతులని తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదంతా తప్పుడు ప్రచారమన్న కలెక్టర్.. జోన్ ప్రకటించినంత మాత్రాన భూసేకరణ జరగదని స్పష్టం చేశారు. ఇందులో ఇంకా అనేక ప్రక్రియలు ఉన్నాయని.. అప్పుడే పూర్తయినట్లు కాదని వివరణ ఇచ్చారు. గత నవంబర్ లో ప్రకటించిన మాస్టర్ ప్లాన్ పై ఇప్పటి వరకు 1026 అభ్యర్థనలు వచ్చాయన్న కలెక్టర్… అభ్యర్థనల స్వీకరణకు జనవరి 11 వరకు సమయం ఉందని చెప్పారు. మాస్టర్ ప్లాన్ కి విరుద్ధంగా ఉన్న రైతుల నుంచి అభ్యర్థనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. “కామారెడ్డి పట్టణానికి మాస్టర్ ప్లాన్ ముసాయిదాని గత నవంబర్ లో ప్రకటించాం. ఇందుకోసం జీవో 199 జారీ చేశాం. ఈ ప్లాన్ పై అభ్యంతరాల స్వీకరణకు 60 రోజుల సమయం ఇచ్చాం. ఇందులో భాగంగా అందరి నుంచి అబ్జెక్షన్స్ తీసుకుంటున్నాం. అవన్నీ నమోదు చేస్తున్నాం. ప్రతి అభ్యంతరానికి సమాధానం ఇస్తాం. ఈ సమాచారాన్ని అందరికీ చేరవేస్తూ.. పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. భూములు పోతాయని ఎందుకు అపోహపడుతున్నారో తెలియట్లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్ లను మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచాం. అంత మాత్రాన భూములు పోతాయని భయపడొద్దు. గత ప్లాన్ లోను ఇండస్ట్రియల్ జోన్ ఉంది. దాని పరిధిలో ఉన్న భూములు పోలేదు కదా ? ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు ? జోన్ ప్రకటించినంత మాత్రాన భూసేకరణ చేస్తున్నట్లు కాదు. ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత అందరితో చర్చిస్తాం. అందరి అనుమానాలు నివృత్తి చేశాకే ముందడుగు వేస్తాం. ఈ అంశంలో ఆందోళన అక్కర్లేదు. రైతులు కంగారుపడాల్సిన అవసరం లేదు. రైతుల భూములు అలాగే ఉంటాయి” అని కలెక్టర్ వివరణ ఇచ్చారు. రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య తర్వాత.. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతుల ఆందోళనలు ఉద్ధృతం అయిన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు.. న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యారు. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా… హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ప్లాన్ ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటీషన్ పై సోమవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. రైతుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తామని హామీనిచ్చారు.

విజ్ఞప్తులను స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. అయినా రైతులు వెనక్కి తగ్గడం లేదు. కొత్త ప్లాన్ తో తమ భూములు పోతాయేమో అన్న అనుమానం రైతుల్లో వ్యక్తం అవుతోంది. అందుకే ముసాయిదాకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేస్తున్నారు. రైతుల నిరసనలకు విపక్ష పార్టీల నేతలు మద్దతు తెలుపుతున్నారు. మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఉన్న కొంచెం భూమి ఇండస్ట్రియల్ జోన్‌కు పోతుందున్న ఆవేదనతోనే రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఈ క్రమంలో కలెక్టరేట్ కు వెళ్తున్న బండి సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఫలితంగా శుక్రవారం అర్ధరాత్రి కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం కామారెడ్డిలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్‌ ప్రణాళికను ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి.. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు. ఈ క్రమంలో రైతులు ఆందోళనకు దిగారు.