టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది.

నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలంటూ శుక్రవారం సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కమిషన్ అధికారులు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.పరీక్షకు అనుమతించి.. ఫలితాలు ప్రకటించవద్దన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. నిందితులు షమీమ్, సురేష్, రమేష్, సాయి సుష్మితలకు హాల్ టికెట్లు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ అప్పీలును కొట్టివేసింది.

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్ పీఎస్సీ కీలక సూచనలు

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు జరగనుంది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ పరీక్ష జరగనుంది. పరీక్ష కోసం ఇప్పటికే 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. రేపు పరీక్ష జరగనున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది.

పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించబోమని తెలిపింది. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షూ ధరించకూడదు. నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి. జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్ గుర్తించదని పేర్కొంది.

వైట్‌నర్, చాక్ పౌడర్, బ్లేడ్, ఎరేచర్‌తో బబ్లింగ్ కచేసే ఓఎంఆర్ షీట్ చెల్లదు అని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే క్రమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పరీక్ష కోసం 3,80,072 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.