Headlines

స్కూల్స్ లో ఇకపై “నో బ్యాగ్ డే”.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పాఠశాలలలో పిల్లల మంచి భవిష్యత్తు కోసం, పిల్లలపై ఒత్తిడి తగ్గించడం కోసం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రతి నెల నాలుగవ శనివారం రోజు నో బ్యాగ్ డే ని అమలు చేయాలని నిర్ణయించింది.

ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

విద్యార్థులను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి, వారిలోని సృజనాత్మకతను మరింత పెంచడానికి, క్షేత్రస్థాయి సందర్శనలతో పిల్లలకు నాలెడ్జ్ పెంచడానికి నిర్ణయించిన తెలంగాణ విద్యాశాఖ “నో బ్యాగ్ డే” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా స్కూల్ పిల్లల పుస్తకాల భారాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా నో బ్యాగ్ డే రోజున పలు కార్యకలాపాలను పిల్లల తోటి చేయించాలని నిర్ణయం తీసుకుంది.

పాఠశాల విద్యాశాఖకు చెందిన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థుల కోసం మొత్తం విద్యా సంవత్సరంలో 10 నో బ్యాగ్ డే లను నిర్ణయించింది. ఆ రోజులలో వారు చేపట్టాల్సిన కార్యక్రమాలను పేర్కొంది. వీటిలో 28 రకాల కార్యకలాపాలు ఉండగా వాటిని వారి సామర్థ్యాన్ని బట్టి ఉపయోగించుకునే అవకాశం కూడా ఇస్తుంది.

ఇక నో బ్యాగ్ డే రోజున విద్యార్థులు చేపట్టవలసిన కార్యకలాపాల విషయానికి వస్తే మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలు, గ్రామపంచాయతీలు వంటి కార్యాలయాలను సందర్శించడం చేయనున్నారు. సైన్స్ ప్రయోగాలు, డూడ్లింగ్, మోడల్ ఎలక్షన్స్, మోడల్ అసెంబ్లీ వంటి ఇండోర్ కార్యకలాపాలు, అంతేకాకుండా పాఠశాలలోనే వివిధ విషయాలను నేర్చుకోవడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

ప్రైమరీ కేటగిరిలో 1, 2 వ తరగతి చదివే విద్యార్థులకు ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తుల మాదిరిగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల పిల్లల్లో భయం పోయి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. వారిలో సృజనాత్మక శక్తి పెరిగేలా ఫ్యామిలీ లోని ఒక వ్యక్తి యొక్క బొమ్మ గియ్యవలసిన ఉంటుంది.