పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 9:
ఎలక్ట్రికల్ రంగంలో నూతన ఆవిష్కరణల అవసరం ఎంతో ఉందని, విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలని గౌహతి ఐఐటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ విభాగం ఆచార్యులు డాక్టర్ అడ్డా రవీంద్రనాథ్ సూచించారు. ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో కాంప్రహెన్సీ ఓవర్ వ్యూ ఆఫ్ యాక్టివ్ పవర్ డికాప్లింగ్ విత్ అప్లికేషన్ స్విచ్డ్ బూస్ట్ ఇన్వెర్టర్ అనే అంశంపై శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధి రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు వేసే ప్రతి అడుగు వారి విజయానికి మెట్టుగా నిలవాలని చెప్పారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే కొత్త సాంకేతికతలపై పట్టు సాధించాలని సూచించారు. ఎలక్ట్రికల్ రంగానికి సంబంధించి దేశంలో జరుగుతున్న పలు పరిశోధనల గురించి తెలియజేసారు. ఇన్వర్టర్ నుంచి వచ్చే విద్యుత్ నాణ్యతను పెంచుకునేందుకు ఎటువంటి పరికరాలను సమకూర్చుకోవాలి, కెపాసిటర్, ఇండక్టర్ పరికరాల ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ టి. రమేష్, ఆచార్యులు డాక్టర్ పి.శంకర్, డాక్టర్ శ్రీ ఫణీకృష్ణ కర్రి, డాక్టర్ వి.సందీప్, కిరణ్ తీపర్తి తదితరులు పాల్గొన్నారు.