మాధవరం లో వీధి వీధిన సకల జన సమ్మేళన యాత్ర..ఇంటింటికి వెళ్లిన డిప్యూటీ సీఎం కొట్టుసత్యనారాయణ..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 9 :

ఆశీర్వదించండి…అభివృద్ధి కొనసాగించండి….అనే నినాదంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేపట్టిన సకల జన సమ్మేళన యాత్ర తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో శుక్రవారం వీధి వీధినా కొనసాగింది. మంత్రి కొట్టు కాలి నడకన ముందుకు సాగుతూ ప్రతి ఇంటి వద్ద ఆగి జనంతో మమేకమయ్యారు. వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీలకతీతంగా తమ ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రతి ఇంట్లోనూ చదువుకునే పిల్లలకు అమ్మబడి, మహిళకు డ్వాక్రా రుణమాఫీ, 45 ఏళ్లు నిండిన మహిళకు వైయస్సార్ చేయూత, రైతుకు రైతు భరోసా, ఉన్నత చదువులు చదివే వారికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, సొంతిల్లు లేని వారికి జగనన్న ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం…. ఇలా అన్ని విధాలుగా ప్రతి కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదుకుంటున్న తీరును ఆయన యాత్రలో విశదీకరించారు. కాపు ప్రాబల్యం అధికంగా ఉండే మాధవరం గ్రామంలో పవన్ కళ్యాణ్ మాట విని తెలుగుదేశానికి ఓటు వేస్తే నష్టపోతామంటూ ప్రజలకు అవగాహన కలిగించారు. సినీ వ్యామోహం లో పవన్ కళ్యాణ్ మాట విని జనసేనలో తిరిగే కాపు యువతకు తల్లిదండ్రులు సరైన మార్గం చూపించాలని ఆయన సూచించారు. మళ్లీ వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చాటి చెప్పారు. ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీని కోసం ప్రతి ఒక్కరు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. మండలంలో అతిపెద్ద గ్రామమైన మాధవరం లో మంత్రి కొట్టు శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి బాగా పొద్దుపోయే వరకు వీధి వీధి సందు సందు తిరుగుతూ ప్రతి ఇంటి ముందు ఆగి ప్రజలతో మాట్లాడుతూ తిరిగి వారితో మాట్లాడిస్తూ సకలజన సమ్మేళన యాత్ర సాగింది. మంత్రి కొట్టు గ్రామంలో ప్రతి వీధికి ప్రతి సందుకు వెళ్లి తిరగడం ప్రతి ఇంటి ముందు ఆగి ఆ ఇంట్లో వారితో మాట్లాడటం చూసి అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా మంత్రి కొట్టు వెంట యాత్రలో పాల్గొన్నారు. మహిళలు హారతులు ఇచ్చి పూలు జల్లుతూ స్వాగతం పలికారు.