Headlines

పరిశోధనా కృషికి పబ్లికేషన్షే కొలమానం ..

 

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 24:

 

విద్యార్థులు, ఆచార్యుల పరిశోధనా కృషికి పబ్లికేషన్షే కొలమానమని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ( కాంచీపురం చెన్నై) ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బి.చిట్టిబాబు తెలిపారు. ఏపీ నిట్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్.మూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నాణ్యమైన, సమర్ధవంతమైన పరిశోధనా పత్రాలను పేరెన్నికగన్న అంతర్జాతీయ జర్నల్స్ లో ఏ విధంగా ప్రచురించాలి అనే అంశంపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి.రమేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధి చిట్టిబాబు మాట్లాడుతూ పరిశోధక విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తే ఆయా ఆలోచనలను ఆచరణాత్మక అవిష్కరణలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన తోడ్పాటును అందించేందుకు ఆచార్యులు మార్గదర్శిగా వ్యవహరిస్తారని చెప్పారు. పరిశోధకులు ఏ విషయంపై శోధిస్తున్నారో ఆయా అంశానికి సంబంధించిన పుట్టుపూర్వత్తరాలను లోతుగా విశ్లేషించటంతోపాటు కొత్తగా కనుగొన్న వాస్తవిక విషయాలను జోడించి పేపర్లను ప్రచురించాలని చెప్పారు. నాణ్యమైన పరిశోధనా పత్రాలను ప్రచురిస్తే ఐఐటి. ఎన్ఐటి వంటి విద్యాసంస్థలతో పాటు కంపెనీల్లో సైతం ఉద్యోగాలను దక్కించుకోవచ్చని, విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలని వివరించారు. జర్నల్ పేపర్స్, కాన్ఫరెన్స్ పేపర్ల తేడాలను తెలియజేశారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి.సందీప్, చిట్టిబాబును జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 45 మంది పిహెచ్ది విద్యార్థులు పాల్గొన్నారు.