Headlines

అట్లాంటింక్ మహాసముద్రంలో విషాదం

అట్లాంటింక్ మహాసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. మూడు పడవల్లో వెళుతున్న 300 మంది వలసదారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరంతా 15 రోజుల క్రితం సెనెగల్ నుంచి స్పెయిన్‌లోని కానరీ ఐలాండ్స్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
ఒక బోటులో 200 మంది, మిగిలిన రెండు బోట్లలో 65, 60 మంది చొప్పున ఉన్నట్టు వలసదారులకు సాయం చేసే వాకింగ్ బోర్డర్స్ సంస్థ తెలిపింది. ఇపుడు ఈ అదృశ్యమైనవారు ఏమయ్యారో అంతుచిక్కడం లేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇటీవలి కాలంలో ఆఫ్రికా నుంచి కానరీ ఐలాండ్స్‌కు వలసదారులు తరలివెళ్లడం సర్వసాధారణంగా మారిపోయింది.

ముఖ్యంగా, వేసవి కాలంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. గత యేడాది 22 మంది చిన్నారులతో సహా 559 మంది కానరీ ఐలాండ్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది. గత యేడాది ఇదే విధంగా వలసలు వెళుతూ 1,784 మంది చనిపోయినట్టు ఐరాస తెలిపింది. అయితే, అంతకుముందు యేడాదితో పోల్చితే ఈ సంఖ్య 30 శాతం మేరకు తగ్గిందని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.