టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన సిట్.

టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో సిట్ నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఈ కేసులో ఇప్పటికి 49 మంది అరెస్ట్ చేసినట్లు సిట్ ఛార్జ్ షీట్ లో పేర్కొంది.

పేపర్ల లీక్ కేసులో రూ.1.63 కోట్ల నగదు చేతులు మారినట్లు తెలిపింది. ఈ కేసులో 16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు ప్రస్తావించింది. నిందితుడు ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్ లో ఉన్నట్లు పేర్కొంది. నగదు లావాదేవీలకు సంబంధించి

నిందితుల ఖాతా వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

డీఏఓ పేపర్ 8 మందికి, ఏఈ ప్రశ్నాపత్రం 13 మందికి లీక్ కాగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ నలుగురి, ఏఈఈ పేపర్ ఏడుగురికి లీక్ అయినట్లు చెప్పారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీక్ నలుగురు ఉండగా.. అందులో టీస్పీఎస్సీ ఉద్యోగులే ముగ్గురు ఉన్నారు. నిందితుల నుంచి సేకరించిన సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను రామాంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సి్క్ సైన్స్ ల్యాబోరేటరికి పంపామని పేర్కొన్నారు.

డీఈ పూల రమేష్ బృందం ఏఈఈ, డీఏవో పరీక్షల్లో మాస్ కాపియింగ్ పాల్పడినట్లు కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. అయితే కేసు ఇప్పటికీ దర్యాప్తు దశలోనే ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఫోరెన్సీక్ నివేదిక తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. లీకేజీలో కమిషన్‌ కాన్ఫిడెన్షియల్‌ విభాగం ఇన్‌చార్జ్‌గా ఉన్న శంకర్‌ లక్ష్మి పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జ్ షీట్ లో ప్రస్తావించిందో లేదో ఇంకా తెలియరాలేదు.

అయితే పేపర్ల లీక్ కేసులో ఆమెకు ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆమెకు సంబంధించి సిట్ అధికారులు కాల్ డేటా, ఇతర ఆధారాలు సేరించినట్లు తెలుస్తోంది. శంకర లక్ష్మి 2017 నుంచి టీఎస్‌పీఎస్‌సీలో పని చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తాము ఎంత కష్టపడి పరీక్షలు రాస్తే పేపర్లు లీక్ చేసి తమ జీవితాలను ఆగం చేశారని వారు వాపోతున్నారు. ఇప్పుడు మళ్లీ పరీక్షలు రాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.