Headlines

వైఎస్ భాస్కర్ రెడ్డికి దక్కని ఊరట

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది.

వివేకా హత్యకేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఏప్రిల్ 14వ తేదీన అరెస్టయిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం పులివెందులలో ఆయనతో పాటు గజ్జెల ఉదయ్‌ కుమార్‌ను అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌కు తరలించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వారికి రిమాండ్‌కు పంపించింది.

వివేకానంద రెడ్డి తన నివాసంలో హత్యకు గురైన రోజు శివశంకర్‌తో కలిసి ఉదయ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లాడనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అక్కడి నుంచి నేరుగా వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇంటికి ఉదయ్ కుమార్ రెడ్డి వెళ్లాడని సీబీఐ అనుమానిస్తోంది. ఈ కోణంలో సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. ఇందులో భాగంగానే వారిద్దరినీ అరెస్ట్ చేసింది సీబీఐ.