మాది రైతు ప్రభుత్వం..అన్నదాతను అన్ని విధాలా ఆదుకుంటాం. —ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం కొట్టు సుడిగాలి పర్యటన..

 

 

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 9 :

 

తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో ముంపు ప్రాంతాల్లో శనివారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పెంటపాడు మండలంలోని దర్శిపర్రు, వల్లూరుపల్లి, రాచర్ల, రావిపాడు, బి.కొండేపాడు, మీనవల్లూరు గ్రామాలతో పాటు తాడేపల్లిగూడెం మండలంలోని మారంపల్లి, జగన్నాధపురం గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. తుఫాను ప్రభావంతో వీచిన పెను గాలులు, కురిసిన భారీ వర్షాలకు నేలకొరిగి నీటిలో నానుతున్న వరి పొలాలను మంత్రి కొట్టు సందర్శించారు. వర్షం నీటిలో తడిసి ఆరబెట్టిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయా గ్రామాలు వెళుతూ దారి మధ్యలో రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యాన్ని అక్కడికి అక్కడ కారు దిగి ఆకస్మికంగా పరిశీలించారు. రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారని, ఇప్పటికే చాలామంది రైతులు దీనిని సద్వినియోగం చేసుకున్నారని ఇంకా మిగిలిన వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. దర్శిపర్రులో ఆరబెట్టిన ధాన్యం కల్లాన్ని స్వయంగా చూసి ధాన్యం గింజలను అరచేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీలించారు. వెంటనే ఈ ధాన్యం ఆఫ్ లైన్ లో మిల్లుకు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆ సమయానికి ధాన్యం బస్తాలు లోడుతో అక్కడికి వచ్చిన ట్రాక్టర్ వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడినుంచి వెళుతూ వల్లూరుపల్లికి సమీపంలో రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యాన్ని చూసి వెంటనే కారు దిగి అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. ఆఫ్ లైన్ విధానం తమకు ఎంతో ఉపయోగపడిందని అక్కడ రైతులు మేడిది శ్రీను, మలిశెట్టి ఆంజనేయులు, చిన్నాల సుబ్బారాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మిన రెండు రోజుల్లోనే డబ్బులు తమ ఖాతాలో పడ్డాయని సంతృప్తి చెందారు. అనంతరం రాచర్ల, రావిపాడు గ్రామాలలో ఆరబెట్టిన ధాన్యం రాశులను, మొలకలు వచ్చిన ధాన్యం గింజలను చూశారు. బి.కొండెపాడు లో రోడ్డు పక్కన నేలకొరిగిన వరి చేలను పరిశీలించారు. మీనవల్లూరు, రామచంద్రపురం గ్రామాలలో యనమదుర్రు కాలవ ఎడమ గట్టును అనుకుని ఐదు తలల మెట్ట పొలాల్లో ఎర్రకాలువ ఉధృతికి నిండా మునిగి చెరువులను తలపిస్తున్న వరి పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను వారి వారి పొలాలలో నిలబెట్టి డేటు, టైము వచ్చేలా ఫోటోలు, వీడియోలు తీసి ప్రత్యేకంగా నివేదికలు పంపాలని, అలాంటి రైతులు అందరికీ పంటల భీమా వర్తించేలా ముఖ్యమంత్రితో మాట్లాడతానని డిప్యూటీ సీఎం కొట్టు చెప్పారు. తుఫాను, భారీ వర్షాలకు ముందు తీసిన పంట కోత ప్రయోగం ప్రామాణికంగా తీసుకుంటే వర్షం నీటికి మునిగి నష్టపోయిన రైతులకు న్యాయం జరగదని కాబట్టి వీరిని ప్రత్యేకంగా పరిగణించాలని ఆయన సూచించారు. దానికి అనుగుణంగా నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని మారంపల్లి, జగన్నాధపురం గ్రామాలలో ఎర్ర కాలువ ముంపునకు గురైన పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు తేమశాతంతో నిమిత్తం లేకుండా ఆఫ్ లైన్ విధానంలో కొనుగోలు చేసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతుల నుంచి చివరి ధాన్యం గింజ కొనుగోలు చేసేంతవరకు ఆఫ్ లైన్ విధానం కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరతానని చెప్పారు. ధాన్యం కొనుగోలు లో దళారి వ్యవస్థ ను నిర్మూలించి మిల్లర్ తో ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా మద్దతు ధరకు కొనుగోలు చేసి మిల్లుకు పంపిస్తుంది అన్నారు. తడిసిన ధాన్యాన్ని ఆఫ్ లైన్ లో కొనుగోలు చేయడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాకుండా 80 శాతం రాయితీకి ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తుందని ఆయన తెలియజేశారు. రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నదాతకు అండగా ఉండి అన్ని విధాల ఆదుకుంటారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ రైతులకు భరోసా కల్పించారు. ఈ పర్యటనలో ఆయన వెంట తాడేపల్లిగూడెం ఆర్డీవో కే.చెన్నయ్య, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పెంటపాడు మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కట్టుబోయిన కృష్ణ ప్రసాద్, సొసైటీల చైర్మన్లు గుండుమోగుల సాంబయ్య, కైగాల గణపతి, జడ్డు హరిబాబు, చిక్కాల సత్యనారాయణ, గుమ్మల్ల తాతారావు, జడ్పిటిసిలు ముత్యాల ఆంజనేయులు, ఉప్పులూరు వరలక్ష్మి, ఎంపీపీలు దాసరి హైమావతి, ఫోనుకుమాటి శేషులత, ఎంపీటీసీ తోట నిరీక్షణరావు, సర్పంచ్ లు ఉండ్రాజవరపు చంద్రిక రాజు, పెన్నాడ సూరిబాబు, సరిపల్లి పద్మ చిట్టిబాబు, పెంటపాడు మండలం జేసిఎస్ కన్వీనర్ మైలవరపు పెద్దబాబు, రావిపాడు సొసైటీ మాజీ చైర్మన్ దేవ వెంకటరమణ, మునగాల బాబ్జి, వాకా వెంకట సుబ్బారావు, మారంపల్లి మాజీ సర్పంచ్ కృష్ణంరాజు, ఏ డి ఏ మురళీకృష్ణ, తహసిల్దార్లు శివశంకర ప్రసాద్, శేషగిరిరావు, ఏవో ఆర్ఎస్ ప్రసాద్, జగన్నాధపురం పంచాయతీ కార్యదర్శులు కుంచాల శ్రీనివాస్ రెడ్డి, జడ్డు ఫణీంద్ర కుమార్, మారంపల్లి సెక్రటరీ అహ్మద్, నవాబుపాలెం సొసైటీ డైరెక్టర్ చిట్టూరి బాపన్న, అడ్డాల గోపి, దారపురెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.