ఏపీ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ – హైకమాండ్ నిర్ణయం..!

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా. పార్టీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఢిల్లీలో పార్టీ నాయకత్వం రెండు రోజులుగా వచ్చే లోక్ సభ.. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఏపీలో చేపట్టాల్సిన కార్యాచరణ పైన చర్చించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల మార్పు పైన కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న పురందేశ్వరి స్థానంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.

 

ఏపీ పై బీజేపీ ఫోకస్ : ఏపీలో భవిష్యత్ కార్యాచరణ పైన బీజేపీ నాయకత్వం ఫోకస్ చేసంది. పార్టీ ముఖ్య నేతల సమాచారం మేరకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలోనే ఏపీ డాధ్యతలు పురందేశ్వరికి అప్పగించారు. మరో మూడు నెలలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలో ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు – పురోగతి లేదనేది హైమాండ్ భావనగా చెబుతున్నారు. పార్టీలోని కొందరు నేతలు చేసిన ఫిర్యాదుల పైన పరిశీలన చేసిన పార్టీ నాయకత్వం అధ్యక్ష మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అధిష్ఠానం సైతం పురందేశ్వరి నుంచి ఆశించిన స్థాయిలో పని తీరు లేదనే అభిప్రాయంతో ఉందని తెలుస్తోంది.

 

 

మార్పులు తప్పవా : ఎన్నికల వేళ కొత్త నేతకు పగ్గాలు ఇవ్వాలనేది ఆలోచనగా చెబుతున్నారు. కొద్ది నెలల క్రితమే బీజేపీలో చేరిన ఏపీ ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. ఆయనకు పార్టీలో చేర్చుకొనే సమయంలోనే రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వాలనే చర్చ జరిగింది. అప్పుడు సమీకరణాల్లో భాగంగా పురందేశ్వరికి అవకాశం ఇచ్చారు. కానీ, ఇప్పుడు మార్పు చేస్తే రెడ్డి వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి, బీసీ వర్గానికి చెందిన సత్య కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఢిల్లీ నేతల సమాచారం. ఇదే సమయంలో తెలంగాణలోనూ మార్పు తప్పదని తెలుస్తోంది. ఎంపీ బండి సంజయ్ కు తిరిగి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

 

 

పొత్తులపై నిర్ణయం ఏంటి : ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. తమతో కలిసి రావాలని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ బీజేపీని కోరుతున్నారు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ లేదు. ఏపీలోని బీజేపీ నేతలు హైకమాండ్ నిర్ణయం మేరకే పొత్తులు ఉంటాయని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఏపీకి బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తే బీజేపీ మూడ్ ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి..పార్టీలో ప్రచారం సాగుతున్నట్లుగా అధ్యక్ష పదవి విషయంలో పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.