సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం:- రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకులు అమరేంద్రకుమార్…

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 30:

_వశుసంవర్ధకశాఖలో ఉద్యోగ బాధ్యతతో నిరంతరం శ్రమిస్తూ విధులు నిర్వహించి రాష్ట్ర స్థాయిలోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన పితాని సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం అని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకులు డాక్టర్ ఆర్. అమరేంద్ర కుమార్ అన్నారు. మండలకేంద్రమైన పెంటపాడులోని పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో మంగళవారం వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్గా పదవీ విరమణ పొందిన సత్యనారాయణ దంపతులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ విధుల్లో భాగంగా పశు రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి ఆర్ధిక అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. గ్రామాల్లో పశువులు వ్యాధులకు గురైనప్పుడు రాత్రి, పగలు అనే తేడాలేకుండా వైద్యం అందించి వాటి ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేశారన్నారు. ఉద్యోగ బాధ్యతతో పాటు తోటి ఉద్యోగుల సంక్షేమం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేశారన్నారు. శ్రమనే ఆయుధంగా నమ్ముకుని వశుసంవర్ధక శాఖలో నమ్మకమైన ఉద్యోగిగా విధులు నిర్వహించి పదవి విరమణ చేయడం అభినందనీయం అన్నారు. ప్రతీ ఉద్యోగి పితాని సత్యనారాయణను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మురళీకృష్ణ, విజయనగరం జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ విశ్వేశ్వరరావు. తాడేపల్లిగూడెం పశుసంవర్ధకశాఖ ఉప సంచాలకులు డాక్టర్ సుధాకర్, తణుకు డిడి డాక్టర్ హుస్సేన్. ఎడి నాయక్, డాక్టర్ మహేష్. బాబూరావు, తోటి అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, అధికారులు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పాల్గొని పితాని సత్యనారాయణ దంపతులను సత్కరించి అభినందనలు తెలిపారు.