Headlines

గర్బిణులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్- ఇకపై ఆ రెండు కీలక టెస్టులు ఫ్రీ…

ఏపీలో గర్బిణులకు వైఎస్ జగన్ ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అందిస్తున్న చికిత్సల్ని పెంచుకుంటూ వస్తున్న ప్రభుత్వం..ఇప్పుడు గర్బిణుల కోసం రెండు కీలకమైన పరీక్షల్ని ఉచితంగా చేయించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

తద్వారా రాష్ట్రంలో వేలాది గర్బిణులకు మేలు జరుగనుందని ఆరోగ్యమంత్రి విడదల రజనీ ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో గర్భిణులకు ఆల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందించబోతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ లను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో … ఆ సేవలను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లాంఛనంగా ప్రారంభించారు.

ఎంతో ఖరీదైన ఈ సేవలను ఇప్పటివరకు రోగులు డబ్బులు చెల్లించి చేయించుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రభుత్వమే ఈ ఖర్చు భరిస్తుందని మంత్రి రజనీ తెలిపారు. ఏటా 64వేల మందికిపైగా టిఫా స్కానింగ్ అవసరం ఉంటుందని భావిస్తున్నామని, అందుకు దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని ఇకపై ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాన్పులకు ఆరోగ్యశ్రీ వర్తించేది కాదని, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా కాన్పులు చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు డాక్టర్ సిఫార్సు చేసే అందరికీ టిఫా స్కానింగ్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తారని చెప్పారు.