ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా కంపెనీ ఖాతాలను దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది

ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా కంపెనీ ఖాతాలను దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. కంపెనీ ఖాతాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ… కంపెనీ డైరెక్టర్లు స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించకుండా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ జూన్‌ నెలలో ఆదేశాలు జారీ చేసింది.

కంపెనీ ఖాతాల్లో చూపిన మొత్తాలు నిజమైనవి కావని… బాగా పెంచి చూపారని సెబీ అంటోంది. అలాగే నిధులను విదేశాలకు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని చూసిన కేంద్రం కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఎరోస్‌ ఖాతాల దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలను పేర్కొంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌లో పలు సినిమాలను నిర్మించడంతో పాటు పంపిణీ రంగంలో ఉన్న ఎరోస్‌కు… ఎరోస్‌ నౌ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కూడా ఉంది. కంపెనీ ఖాతాలను పరిశీలించిన సెబీ గత నెలలో ఎరోస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ అర్జన్‌ లుల్లాతో పాటు మరో ముగ్గురు డైరెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు వేసింది.