ఈవీఎంలపై జగన్ ట్వీట్.. పులివెందుల పులి ఏదో అంటుందంటూ జనసేన శతాఘ్ని కౌంటర్..

మనదేశంలోనూ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వాడాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లనే వాడుతున్నారని, భారత్ లోనూ ఎన్నికలలో ఈవీఎంలకు బదులుగా వాటినే వాడాలంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. న్యాయం జరగడమే కాదు.. జరిగినట్టు కనిపించాలని అన్నారు.

 

కాగా.. రేపు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలతో జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులంతా హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరగనుండగా.. ఈ సమావేశం నుంచి ఎంపీలకు మినహాయింపు ఉంది.

 

ఇటీవలే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కలలో కూడా ఊహించనంత మెజార్టీతో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయగా.. వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. తమ ఓటమికి కారణాలేంటో తెలియడం లేదని, అంతా ఆ దేవుడికే తెలియాలని పలుమార్లు వాపోయిన జగన్.. ఇప్పుడు ఈవీఎంలపై ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

 

మరోవైపు జగన్.. తన భద్రత కోసం ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి 30 సిబ్బంది సోమవారం తాడేపల్లిలో ఉన్న జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. దాంతో అక్కడ కొద్దిసేపు హడావిడి నెలకొంది. వారికి క్యాంప్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు అనుమతి వచ్చిన తర్వాత అందరూ కార్యాలయంలోకి వెళ్లారు. అధికారం కోల్పోయిన జగన్.. ఇకపై మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతారు. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వ భద్రత తగ్గుతుంది. అందుకే ముందుగానే జగన్.. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకున్నారు.

 

జగన్ ట్వీట్ కు జనసేన శతాఘ్ని టీమ్ కౌంటరిచ్చింది. “ఈవీఎంల గురించి ఏదో ట్వీట్ వేసినట్లున్నావ్ జగన్. నువ్వు పిరికివాడివి కాబట్టే మమ్మల్ని బ్లాక్ చేసుకున్నావ్. అందుకే జనాలు నీ పార్టీని రాష్ట్రం నుంచి బ్లాక్ చేసేశారు. ఇంకా నువ్వు ఈవీఎంల మీద ఏడిస్తే.. ఈ వీడియోలో ఈఎంల పనితీరు గురించి పులివెందుల ఎమ్మెల్యే ఏదో చెప్తున్నాడు విని తరిస్తావని ఆశిస్తున్నాం. ఇలాంటి సచ్చు సలహాలిచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు వింటే ఉన్న 11లో ఒక్కటి మాత్రమే మిగులుతుందని ప్రజలంటున్నారు. నీకు వీలైతే మమ్మల్ని అన్ బ్లాక్ చెయ్ .. సరదాగా గత ఐదేళ్ల అభిృద్ధి గురించి మాట్లాడుకుందాం.” అని జనసేన శతాఘ్ని టీమ్ కౌంటర్ ట్వీట్ చేసింది.