Headlines

ఆ దేశాల్లో దుర్భర జీవితం.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?

ఇటీవల ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీగా ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. మరి ప్రపంచంలోనే అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న దేశం ఏంటి..? ఇలాంటి సర్వే కూడా ఒకటి రెడీ అయింది.

వరల్డ్ మోస్ట్ మిజరబుల్ కంట్రీ పేరుతో జరిగిన అన్వేషణ జింబాబ్వే దగ్గర ఆగింది. అవును, జింబాబ్వే ఈ ప్రపంచంలోనే అత్యంత దుర్భర దేశంగా పేరు తెచ్చుకుంది. ఆ దేశ ద్రవ్యోల్బణం 243.8శాతం. ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా.. అక్కడి పేద, మధ్యతరగతి వర్గాలకు అసాధ్యం. ద్రవ్యోల్బణం కారణంగా అంతకంతకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో జింబాబ్వే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగం, అప్పులు, ప్రజల అనారోగ్యం, రక్తహీనత.. ఇలా జింబాబ్వే కష్టాలు చెప్పడానికి పేజీలు సరిపోవు.

జింబాబ్వే తర్వాత అత్యంత దారుణమైన జీవన పరిస్థితులు ఉన్న దేశం వెనిజులా. సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా దేశాల్లో ఎక్కడా సామాన్య ప్రజలు కడుపునిండా తినే పరిస్థితి లేదు. అర్థాకలితో అలమటించాల్సిందే, ఆదాయం కోసం అడ్డదార్లు తొక్కాల్సిందే.