Headlines

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తా

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 14న అంకురార్పణ జరగనుంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో కీలకంగా భావించే గరుడ సేవ ఈ నెల 19న జరగనుంది. భక్తులందరికీ దర్శనం కల్పించేలా రాత్రి 12 గంటల వరకు ఉంటుంది.

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19న గరుడసేవ, అక్టోబరు 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. భక్తులందరికీ దర్శనం కల్పించేలా రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవని టీటీడీ స్పష్టం చేసింది.

ప్రత్యేకంగా వాహన సేవలు : అదే విధంగా బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దయ్యాయి. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్‌ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయించారు. భక్తుల భద్రత దృష్ట్యా అక్టోబరు 19న గరుడసేవ నాడు ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేసారు. బ్రహ్మోత్సవాల మరుసటిరోజైన అక్టోబరు 24న పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

గ్రహణం నాడు ఆలయం మూసివేత : బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 17 నుండి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదు. బ్రహ్మోత్సవాల మిగతా రోజుల్లో యధావిధిగా ఉంటుంది. తిరుపతిలో అక్టోబర్‌ 13, 14, 15వ తేదీలలో ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ నిలుపుదల చేసారు. భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనానికి వెళ్లవచ్చని… భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

అదే విధంగా.. అఅక్టోబర్‌ 29న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. అక్టోబర్‌ 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. అక్టోబర్‌ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది.