Headlines

ఫుట్ బాల్ … కొదమ సింహాలు

పచ్చిక మైదానం.. చుట్టూ వేలాది మంది ప్రేక్షకులు… ఒకటే బంతి.. దానికోసం కొదమసింహాల్లా పరిగెడుతున్న తీరు… ఆట అందరూ ఆడతారు.. కానీ కొందరు మాత్రమే గోల్ కొట్టు వరకు అలుపు లేదు.. మనకు అనే తీరుగా ఆడతారు. ఈసారి ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో అసలు సిసలైన ఆటను ప్రేక్షకులకు అందించేందుకు క్రీడాకారులు సిద్ధమయ్యారు.. కానీ వారిలో మెరికల్లాంటి క్రీడాకారుల గురించి ఒకసారి తెలుసుకుందాం. కొత్త స్టార్లు పుట్టుకొచ్చారు ప్రతి ప్రపంచకప్ లో కొత్త ఆటగాళ్లు పుట్టుకు రావడం మామూలే. గత ప్రపంచ కప్ లో ఫ్రాన్స్ యువ ఆటగాడు ఎంబాపే పేరు మార్మోగిపోయింది. అతడు ఆడిన తీరు న భూతో న భవిష్యత్తు. మైదానంలో అతడి కదలిక చూస్తే కేవలం గోల్ సాధించేందుకే పరిగెడుతున్నాడా అన్నట్టు అనిపించింది.. స్పెయిన్ ఆటగాడు పెడ్రిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.. ఇతడి వయసు కేవలం 19 సంవత్సరాలు. బార్సిలోనా తరఫున అదరగొట్టిన ఈ కుర్రాన్ని ‘ఇన్ యోస్టా’ గా పేర్కొంటున్నారు. ఇక 2017లో 17 ఏళ్ల వయసులోనే 46 మిలియన్ యూరోలకు రియల్ మాడ్రిడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న బ్రెజిల్ కుర్రాడు వినిసియస్ ఖతార్ దేశంలో సత్తా చాటుతాడని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు..

గతంలో ఇంగ్లాండ్ జట్టుకు ఆడి.. ఇప్పుడు జర్మనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 19 ఏళ్ల జమాల్ ముసియాలా పై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇంగ్లాండ్ మిడ్ ఫీల్డర్ బెల్లింగ్టన్, ఫ్రాన్స్ యువ కెరటం కమవింగా, పోర్చుగల్ కుర్రాడు నునో మెండీస్ కూడా ప్రమాదకరమైన ఆటగాళ్ళే. వీరు ఏం చేస్తారో? ఫుట్ బాల్ ఆడేది 32 జట్లే. కానీ ప్రపంచంలో 200 దేశాల్లో ఈ ఆటకు ఆదరణ ఉంది. అలాంటి ఆటకు సంబంధించి ప్రపంచ కప్ జరుగుతుంటే.. ఉత్కంఠగా చూసే దేశాలు ఎన్నో.. ఆటగాళ్ళ విన్యాసాల కోసం ప్రేక్షకులు తుది కంటా వీక్షిస్తూ ఉంటారు. ఇక ఈసారి ప్రపంచ కప్ లో కోట్లాదిమంది అభిమానులను సమ్మోహపరిచే ఆకర్షణ శక్తి ఉన్న ఆటగాళ్లు కొంతమందే. వారిలో ముందు వరుసలో ఉండే ఆటగాళ్లు రోనాల్డో, మెస్సీ, నెయ్ మార్. ఆటపరంగా వీరిలో ఎవరి ఆకర్షణ వారిదే. ముగ్గురు కూడా అంతర్జాతీయ స్థాయిలో, క్లబ్ ఫుట్ బాల్ లో అద్భుతాలు చేశారు. కానీ ఈ ముగ్గురికి కప్పు కల నెరవేరలేదు. రొనాల్డో మేటి ఆటగాడు అయినప్పటికీ పోర్చుగల్ జట్టుకు కప్పు గెలిచేంత స్థాయి లేదు. కానీ పోర్చుగల్ ఆడుతుంటే అందరి దృష్టి రొనాల్డో మీదే ఉంటుంది.

ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు అతడే. రికార్డుల్లో అతనికి చేరువగా ఉన్న ఆటగాడు మెస్సి. అతడు తన విన్యాసాలతో చేసే మాయాజాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అతడి అర్జెంటినా జట్టు టైటిల్ ఫేవరెట్ లో ఒకటి.. దీంతో ప్రేక్షకుల దృష్టి మెస్సీ మీదే ఉంటుంది. ఈసారి కప్పు గెలుస్తుందని అంచనా ఉన్న బ్రెజిల్ జట్టుకు అతిపెద్ద ఆకర్షణ నేయ్ మార్. మరి ఈసారి వీరంతా ఎలాంటి మాయలు చేస్తారో, మరెన్ని విన్యాసాలు చేస్తారో కోట్లాదిమంది ప్రేక్షకులు, కోట్లాది కన్నులతో ఎదురుచూస్తున్నారు.