Headlines

రేవంత్ రెడ్డి హెలికాప్టర్‍లో సాంకేతిక లోపం..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. రేవంత్ కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన సమయంలో లోపం ఏర్పడింది.

హెలికాప్టర్ వెళ్లలేని పరిస్థితి ఉండడంతో రేవంత్ రోడ్డు మార్గంలో కామారెడ్డికి వెళ్లారు. రేవంత్ కామారెడ్డి నియోజకవర్గంలో మూడు సభల్లో పాల్గొంటారు. హెలికాప్టర్ కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లడంతో ఈ సభలు ఆలస్యంగా మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో కూడా సాంకేతిక లోపం తలెత్తింది.

రెండు వారాల క్రితం సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ వెంటనే అప్రమత్తమై హెలికాప్టర్‌ను సురక్షితంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో దించారు. ఆ రోజు సీఎం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్‌లో దేవరకద్రకు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. 10 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది.

నవంబర్ 8వ తేదీ బుధవారం. సిర్పూర్ కాగజ్ నగర్ సభ ముగించుకుని ఆసిఫాబాద్ బయలుదేరారు. సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ ఎక్కి అందులో కూర్చున్నారు. అయితే ఐదు నిమిషాలైనాహెలికాఫ్టర్ గాల్లోకి లేవలేదు. దీంతో పైలెట్, ఇతర సిబ్బంది పరిశీలించారు. హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఉందని గుర్తించారు. సరిచేసేందుకు సమయం పడుతుందని చెప్పడంతో సీఎం కేసీఆర్ అసిఫాబాద్ కు రోడ్డు మార్గంలో వెళ్లారు.

మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తటం ఆందోళన కలిగించింది. కానీ ఆ తర్వాత ఎలాంటి సమస్య రాలేదు. అయితే హెలికాప్టర్ సాంకేతిక లోపం ఏర్పడం సాధారణమేనని చెబుతున్నారు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విషయం విదితమే. అంతకు ముందు బాలయోగి కూడా హెలికాప్టర్ ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు.