Headlines

ఇండియా ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్..

ఇండియా ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. సంప్రదాయ ముడిచమురు సరఫరాదారులు అయిన ఇరాక్, సౌదీ అరేబియాల కన్నా అధికంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఫిబ్రవరిలో ఈ దిగుమతులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి నెలలో రికార్డ్ స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. ప్రస్తుతం 35 శాతం చమురు దిగుమతుల వాటాను రష్యా దక్కించుకుంది.

ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా ప్రకారం, భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ సరఫరా చేయడం ద్వారా వరసగా ఐదో నెల అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా నిలిచింది. ఫిబ్రవరి 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా కేవలం 1 శాతం కన్నా తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉండేది. ప్రస్తుతం ఏకంగా 35 శాతం వాటాతో ఏకంగా రోజుకు 1.62 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది.

చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో తను ఆర్థికంగా నిలబడేందుకు మిత్రదేశం భారత్ కు డిస్కౌంట్ పై రష్యా ముడిచమురును ఎగుమతి చేస్తోంది. ఇదే సమయంలో సౌదీ నుంచి భారత్ చమురు దిగుమతులు 16 శాతం తగ్గగా, అమెరికా నుంచి చమురు దిగుమతి 38 శాతం తగ్గింది. దశాబ్ధాలుగా భారత్ కు చమురు దిగుమతిదారులుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి కొనుగోలు చేసి చమురు కన్నా ఇప్పుడు రష్యా నుంచే భారత్ అధికంగా కొనుగోలు చేస్తోంది.

ప్రస్తుతం గణాంకాల ప్రకారం ప్రతీరోజూ రష్యా నుంచి 1.6 మిలియన్లు, ఇరాక్ నుంచి 9,39,921 బ్యారెల్స్, సౌదీ నుంచి 6,47,813 బ్యారెళ్లు, అమెరికా నుంచి 4,04,570 బ్యారెళ్లను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. 16 నెలల కనిష్టానికి సౌదీ, ఇరాక్ సరఫరాలు పడిపోయాయి. యూరప్ దేశాలు రష్యా ఆయిల్ ను కొనుగోలు చేయడం మానేసిన తర్వాత ఆ స్థానాన్ని ఇండియా భర్తీ చేస్తోంది.