Headlines

పాతూరు రైల్వే ట్రాక్ డ్రైనేజీకి మోక్షం..

 

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 5:

 

పట్టణంలోని సుమారు 15 వార్డులకు సంబంధించిన మురుగునీరు ప్రవహించడానికి ఏకైక ప్రధాన మార్గమైన పాతూరు రైల్వే ట్రాక్ డ్రైనేజీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. వన్ టౌన్ లోని హౌసింగ్ బోర్డ్ నుంచి ప్రధాన రహదారికి ఎడమవైపున ఉన్న స్టార్ డం డ్రైనేజీ ద్వారా వచ్చే మురుగునీరు మొత్తం దిగువకు ప్రవహించడానికి ఏకైక మార్గం పాతూరు రైల్వే ట్రాక్ డ్రైనేజీ. పట్టణంలోని ఎగువ ప్రాంతం నుంచి వచ్చే మురుగునీరు అంతా మెయిన్ రోడ్ లోని ప్రధాన డ్రైను లో నుంచి మున్సిపల్ ఆఫీస్ ముందుగా ఓవర్ బ్రిడ్జి మెట్లు దగ్గర నుంచి రైల్వే ట్రాక్ ను ఆనుకుని రైల్వే లైన్ అండర్ టన్నెల్ లో నుంచి శివాలయం వీధిలో ఏలూరు కాలువ వద్దకు చేరుతుంది. అక్కడ ఈ మురికి నీరు ఏలూరు కాలువలో కలవకుండా సైఫాన్ ఏర్పాటుచేసి ప్రత్యేకమైన ఏర్పాట్లు ద్వారా మరో మార్గంలోకి మళ్లిస్తారు. అయితే రైల్వే ట్రాక్ ను ఆనుకుని ఉన్న డ్రైనేజీ చాలా కాలంగా పూడుకుపోవడం, రకరకాల మొక్కలు మొలిచి అసలు అక్కడ డ్రైనేజీ ఉందన్న విషయం కూడా తెలియనంతగా మూసుకుపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు పట్టణంలో మురుగునీరు ప్రవాహాన్ని క్రమబద్ధీకరించే పనుల్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. అవసరమైనచోట్ల కొత్తగా డ్రైనేజీలు నిర్మించడం, ఇప్పటికే డ్రైనేజీలు ఉండి పూడుకుపోయినవి, గుబురుగా మొక్కలు మొలిచి అసలు డ్రైనేజీ ఉందో లేదో అన్నట్లుగా ఉన్న వాటిని గుర్తించి కమిషనర్ శామ్యూల్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగానే ఓవర్ బ్రిడ్జి మెట్లు దగ్గర నుంచి పాతూరు వద్ద రైల్వే ట్రాక్ ని ఆనుకుని వెళ్లే డ్రైనేజీని గుర్తించి గుబురుగా పెరిగిపోయిన మొక్కలను కొట్టించేసారు. డ్రైనేజీలో పేరుకుపోయిన పూడికను తొలగించి వెడల్పు చేసే పనులు చేపట్టారు. అవసరమైన చోట్ల సిమెంట్ తూరలు ఏర్పాటు చేస్తున్నారు. పాతూరు రైల్వే ట్రాక్ కు అటువైపు శివాలయం, ఇటువైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, రామాలయం ఉన్నాయి. దీంతో ప్రతినిత్యం అనేకమంది భక్తులు దర్శనార్థం ఈ ఆలయాలకు వస్తుంటారు. అంతే కాకుండా కుంచనపల్లి, పాతూరు, సత్యవతి నగర్, మహాలక్ష్మి నగర్, పి అండ్ టి కాలనీ, మామిడి తోట, ఇందిరానగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రజల రాకపోకలకు గతం నుంచి ఇది అనువైన ప్రదేశం గా ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం షష్టికి పాతూరు లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు వస్తుంటారు. దీంతోపాటు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి గుడికొచ్చే భక్తులతో పాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి నీ దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అయితే ఇటీవల రైల్వే ట్రాక్ అటువైపున రైల్వే శాఖ లోకో షెడ్ నిర్మించడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ నేటికీ అనేకమంది ఈ మార్గం మీదుగానే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం డ్రైనేజీకి మోక్షం లభించినందున ప్రజలు రాకపోకలకు కూడా ఇబ్బందులు లేకుండా సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. సోమవారం నాటి డ్రైనేజీ పనులను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, సిజిఎఫ్ కమిటీ మెంబర్ కర్రి భాస్కరరావు దగ్గరుండి పర్యవేక్షించారు. అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీమన్నారాయణ పనులు చేయించారు. దీనికోసం ప్రత్యేకంగా కార్మికులను ఏర్పాటు చేసి డ్రైనేజీ పనులు కొనసాగించారు. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న పాతూరు రైల్వే ట్రాక్ డ్రైనేజీ పనులకు మోక్షం లభించడంతో పలువురు వర్షం వ్యక్తం చేస్తున్నారు.