Headlines

2024 సాధారణ ఎన్నికలు మరియు కౌంటింగ్ దృష్ట్యా ప్రజలకు పోలీసువారి హెచ్చరిక…

న్యూస్.9)

1. ప్రజలకు తెలియజేయడమేమనగా సెక్షన్ 144 సి ఆర్ పి సి జిల్లా అంతట అమలులో ఉన్నది. కాబట్టి నలుగురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడి ఉండరాదు. అలా ఉండినచో చట్ట ప్రకారం వారిపైన కఠిన చర్యలు తీసుకొనబడును.

 

2. అదేవిధంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉన్నది. కాబట్టి వ్యక్తులు గాని, రాజకీయ పార్టీలు గానీ పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు గాని, బహిరంగ సభలు గానీ, సమావేశాలు గాని ఎట్టి పరిస్థితులలో నిర్వహించరాదు. అట్లు నిర్వహించిన ఎడల వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.

 

3. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది.

 

4. పదేపదే నేరాలకు, అల్లర్లకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి, వారి నేర చరిత్రను పరిశీలించి వారిపై PD Act నమోదు చేయబడును. అటువంటి వారిని ఒక సంవత్సరం పాటు జైలులో నిర్బంధించెదరు.

 

5. ఎన్నికల కౌంటింగ్ సమయంలో మరియు తదనంతరము హింసకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, రౌడీ షీట్లు ఓపెన్ చేయబడును.

 

6. నేరాలలో పాల్గొని ముద్దాయిలు అయినటువంటి యువతకు పాస్ పోర్టులు నిరాకరించబడతాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు.

7. చట్టాన్ని ఎవరు చేతులలోకి తీసుకోరాదు మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయెడల పోలీసు వారిని సంప్రదించవలెను.

 

8. MRO వద్ద బైండోవర్ చేయబడుతున్న వ్యక్తులు ఎట్టి పరిస్థితులలోనూ బైండోవర్ యొక్క షరతులను ఉల్లంఘించరాదు. ఒకవేళ ఉల్లంఘించిన ఎడల వారి నుండి బైండోవర్ సమయంలో వ్రాసి ఇచ్చిన పూచీకత్తు మొత్తమును తహసీల్దారు గారు వసూలు చేయుదురు. లేనియెడల వారిని రిమాండుకు పంపుదురు.

 

9. ఎన్నికలలో గెలుపోటములు సహజము. కాబట్టి గెలిచినవారు ఓడిన వారి పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడడం కానీ, వారిని హేళన చేయడం కానీ, టపాసులు పేల్చడం కానీ ఎట్టి పరిస్థితులలో చేయరాదు.

 

10. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు. కాబట్టి గెలుపొందిన అభ్యర్థులు ఎట్టి పరిస్థితులలోనూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు.

 

11. కౌంటింగ్ కేంద్రం వద్ద, అన్ని పట్టణాలలోనూ, సమస్యాత్మక గ్రామాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడినవి. కాబట్టి మీరందరూ సీసీ కెమెరాల నిఘాలో ఉన్నారు. నేరాలకు పాల్పడితే వాటి ద్వారా మిమ్ములను గుర్తించి, మీ పైన కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడును.

 

కాబట్టి ప్రజలకు, రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా యువతకు తెలియజేయడమేమనగా సాధారణ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా గానీ, ఆ తరువాత గానీ ఎటువంటి అల్లర్లకు, గలాటాలకు పాల్పడకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగానికి సహకరించవలసినదిగా కోరుచున్నాము.