Headlines

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం కొట్టు పర్యటన…నీట మునిగిన చేలు పరిశీలన..రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 6:

 

మిచోంగ్ తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ బుధవారం పర్యటించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని కడియద్ద, కృష్ణాపురం, నీలాద్రిపురం తదితర గ్రామాలలో పర్యటించి వర్షం నీటిలో మునిగిన పొలాలను పరిశీలించారు. మంత్రి వెంట రెవిన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్, హార్టికల్చర్ సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. అపరాల పంటలైన మినుము, పెసర, వేరుశనగ చేలు వర్షం నీటిలో ముంపునకు గురయ్యాయి. తయారైన కాయలు వర్షం నీటిలో ఎక్కువ రోజులు నానితే మొలకలు వచ్చేసే ప్రమాదం ఉన్నందున తక్షణమే పొలాల్లో నిలిచిపోయిన నీరు డ్రైనేజీల ద్వారా బయటకు వెళ్లి ప్రవహించే లాగా జెసిబి లతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు, పంట పొలాల్లోకి చేరిన నీరును తక్షణమే బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేసామని ఈ సందర్భంగా మంత్రి కొట్టు తెలియజేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో ఇప్పటికే చాలా వరకు వరి కోతలు పూర్తి చేసి రైతులు ఆర్ బి కే లు ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విక్రయించడం, అక్కడ నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించడం పూర్తయిందన్నారు. దీనివలన వరి రైతులు తుఫాను బారిన పడకుండా ధాన్యం అమ్ముకుని సురక్షితంగా బయటపడ్డారన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో మోదుగగుంట, వీరంపాలెం, రామన్నగూడెం, నీలాద్రిపురం, పట్టింపాలెం… ఈ ఆరు గ్రామాలలో మినుము, పెసర వేరుశనగ పంటలను రైతులు 553 హెక్టార్లు అంటే సుమారు 1400 ఎకరాల్లో మూడో పంటగా సాగు చేశారన్నారు. ఇందులో 900 ఎకరాలు వర్షం నీటిలో మునిగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. వర్షం నీరు పూర్తిగా లాగిన అనంతరం అధికారులు నష్టాలను అంచనా వేస్తారని చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని, ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి కొట్టు భరోసా రైతులకు ఇచ్చారు. అలాగే పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో 105 ఎకరాలు, బి.కొండేపాడు, మీనవల్లూరు గ్రామాలలో మరో 190 ఎకరాల్లో మాత్రమే వరి పంట కోతలు జరగవలసి ఉందని గుర్తించామన్నారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కోసిన ధాన్యం రాశులు పోసి బరకాలు కప్పి ఉంచడం జరిగిందన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం తేమ శాతంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అన్నారు. ఈ మేరకు రైతు భరోసా కేంద్రాలకు, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని మంత్రి కొట్టు తెలియజేశారు. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు పంట నష్టపోయిన రైతులకు ఏళ్ల తరబడి పరిహారం ఇవ్వకుండా మరింత నష్టాలకు గురి చేశారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో పరిహారం ఇచ్చి రైతులను తక్షణమే ఆదుకుంటున్నారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. ఈ పర్యటనలో మంత్రి వెంట తాడేపల్లిగూడెం ఆర్డీవో కే.చెన్నయ్య, అగ్రికల్చర్ ఏడి మురళీకృష్ణ ఏవో ఆర్.ఎస్. ప్రసాద్, కొమ్ముగూడెం సొసైటీ చైర్మన్ వెలిశెట్టి నరేంద్ర కుమార్, కడియద్ద, నీలాద్రిపురం సర్పంచులు యాతం కోటేశ్వరి బూరయ్య, రాజమహేంద్రవరపు లక్ష్మణరావు, దారపురెడ్డి శ్రీనివాస్, నీలాద్రిపురం ఎంపీటీసీ మట్ట సత్యనారాయణ, ఇన్చార్జి తాసిల్దార్ శివశంకర్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి పవన్, ఇంకా అగ్రికల్చర్ అసిస్టెంట్లు, ఇరిగేషన్, హార్టికల్చర్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.