Headlines

వీడిన విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీ

విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీ వీడింది. గత ఆదివారం కొమ్మాది వికలాంగుల కాలనీలోని ఇంట్లోని డ్రమ్ములో శవం కనిపించడంతో కలకలం రేగింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. గతంలో ఆ ఇంట్లో అద్దెకు ఉన్న రిషి అనే వ్యక్తిని నిందితుడిగా తేల్చారు. విశాఖ వికలాంగుల కాలనీలో డ్రమ్ములో డెడ్ బాడీ మిస్టరీ వీడింది. ఏడాదిన్నర క్రితం మహిళను హత్య చేసి డ్రమ్ములో పెట్టి పరారైనట్లు గుర్తించారు. వికలాంగుల కాలనీలోని వెల్డింగ్ దుకాణాన్ని నిర్వహించే రమేష్‌కు కొమ్మాది వికలాంగుల కాలనీలో ఓ ఇల్లు ఉంది. తన వద్ద పనిచేసే రిషి అనే వ్యక్తికి ఆ ఇంటిని అద్దెకు ఇచ్చాడు. భార్యతో కలిసి రిషి ఆ ఇంట్లో నివసించే వాడు. 2021లో భార్య ప్రసవం కోసం వెళ్లిన తర్వాత రిషి కూడా కనిపించకుండా పోయాడు. దాదాపు ఏడాదిన్నరగా ఇంటికి తాళం వేసి ఉంటోంది. ఇంట్లో సామానులు ఉండటంతో రమేష్‌ కూడా పట్టించుకోలేదు. కొద్ది రోజులుగా ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు రమేష్‌కు సమాచారం ఇచ్చారు. రిషి ఆచూకీ లేకపోవడంతో ఇంట్లో సామాను బయట పెట్టిస్తుండటంతో డ్రమ్ములో శవం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఆ ఇంట్లో ఉన్న రిషి గురించి ఆరా తీశారు.

అస్థిపంజరంగా మారిన శవాన్ని రిషి భార్యదిగా అనుమానించారు. అతనికి అనుమానం రాకుండా రమేష్‌తో ఫోన్ చేయించారు. రిషి తాను శ్రీకాకుళంలో భార్యతో కలిసి ఉంటున్నట్లు సమాచారం ఇచ్చాడు. వాట్సాప్‌లోొ ఫోటోలు కూడా పంపాడు. మరోవైపు డ్రమ్ములో శవం అచూకీ కోసం ప్రయత్నిస్తూ పోలీసులు శ్రీకాకుళంలో ఉన్న రిషిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని గట్టిగా ప్రశ్నించడంతో హత్య బయటపడింది. ఏడాదిన్నర క్రితం రిషి భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన సమయంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ధనలక్ష్మీతో రిషికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెతో గడిపిన తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో గొంతు నులిమి హత్య చేశాడు. శవాన్ని మాయం చేయడం కుదరక డ్రమ్ములో దాచి పెట్టి శ్రీకాకుళం పారిపోయాడు. వీలు చూసుకుని బాడీని మాయం చేయాలని భావించినా వీలు కుదరక వదిలేశాడు. ఏడాదిన్నర తర్వాత శవం బయట పడటంతో కటకటాల పాలయ్యాడు. మృతురాలికి తల్లిదండ్రులు లేకపోవడంతో విశాఖపట్నంలో ఉంటున్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు కూడా ఆమె అచూకీ పట్టించుకోక పోవడంతో ఇన్నాళ్లు అచూకీ లేకపోయినా ఎవరికి తెలియలేదు.