Headlines

మహిళల రక్షణకు చట్టాలు అండగా ఉన్నాయి.వాటిపై అవగాహన పెంచుకోవాలి–న్యాయమూర్తి దీప దైవ కృప.

చెముడులంకలో మహిళా దినోత్సవం

మహిళల రక్షణకు అనేక చట్టాలు అండగా నిలుస్తున్నాయని వాటిని ఉపయోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి దీపా దైవ కృప సూచించారు. డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిర్డీ సాయి విద్యానికేతన్, ఈశ్వర్ విద్యాలయ మహిళా జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దీపా దైవ కృప ముఖ్య అథిదిగా పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సెల్ వంటి ఆధునిక సాధనాలను ద్వారా మహిళలు రక్షణ పొందే విధంగా పలు చట్టాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని రక్షణ పొందాలన్నారు.అయితే సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటి వాటి విషయాలలో అమ్మాయిలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళలకు విద్యతో సంపూర్ణ హక్కులు పొందగలుగుతారని, అందువలన ప్రతి ఒక్కరు ఉన్నత విద్య కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు సమస్యలను సెల్ ఫోన్స్, పోస్ట్ కార్డు ద్వారా తెలియజేసి రక్షణ పొందవచ్చునని,దీనికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు.ముఖ్యంగా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అందువల్ల విద్యార్థులు అలాంటి సంఘటనలు మీదృష్టికి వస్తే తెలియజేయాలని జడ్జి దైవ కృప చూపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలో చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.విద్యార్థులకు ఎంతో విలువలతో కూడిన విద్యను అందిస్తున్న విద్యాసంస్థల చైర్మన్ ఉమారాణిని ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆలమూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.