Headlines

ఈ నెల 15లోపు నూతన భవనంలోకి విద్యార్ధులను మార్చకపోతే కలక్టరేట్ వద్ద ధర్నా

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం రూరల్, జూలై 6:

శిధిలావస్థకు చేరుకున్న ఆరుగొలను గురుకుల పాఠశాల భవనంలో ప్రాణభయంలో విద్య నేర్చుకుంటున్న విద్యార్ధులను తక్షణమే ఈ నెల 15లోపు నూతన భవనంలోకి మార్చకపోతే అన్ని విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో కలక్టరేట్ ముట్టడి చేసి ధర్నా నిర్వహిస్తామని ఎఐఎస్ఎఫ్, దళిత హక్కుల పోరాట సమితి, కుల నిర్మూలన పోరాట సమితి సంఘాల నాయకులు, విద్యార్ధుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గురువారం ఆరుగొలనులోని డాక్టర్ బి.ఆర్. అంబేధ్కర్ గురుకుల పాఠశాల వద్ద ఎఐఎస్ఎఫ్, దళిత హక్కుల పోరాట సమితి, కుల నిర్మూలన పోరాట సమితి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి టిఎ స్వామి, కెఎన్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎం. జాన్ రాజు, డిడికెస్ జిల్లా కార్యదర్శి దిద్దే నాగేశ్వరరావు, ప్రగతిశీల కార్మికసంఘం సమైఖ్య జిల్లా కార్యదర్శి ఎస్ఆర్ఎస్ మస్తాన్లు, తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభించి సుమారు 20 రోజులు గడుస్తున్నా. వసతులు లేక శిధిలావస్థకు చేరుకున్న పాత భవనంలోనే పాఠాలు బోధించడంతో విద్యార్థులు భయాందోళనకు గురి అవుతున్నారన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా వసతి గృహ భవనం స్లాబ్ నుంచి సిమ్మెంటు రాలిపోవడం, విద్యుత్ లేక ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోవడం, త్రాగునీరు లేకపోవడం, విషపురుగులు ప్రవేశించడంతో విద్యార్థులు ఆందోళనకు గురౌతున్నారన్నారు. వసతి గృహ నూతన భవనం నిర్మాణం చేసి సుమారు 2 నెలలు గడుస్తున్నా నేటికి అది ప్రారంభోత్సవం కాకపోవడంతో విద్యార్థులు శిధిల వసతి గృహంలోనే విద్య నేర్చుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులకు ఏ సమస్య ఏర్పడినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు, ఇటీవల జరిగిన పదవతరగతి ఫలితాల్లో ఈ పాఠశాలకు జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం, ఇంటర్మీడియట్లో ప్రధమ స్థానం సాధించారన్నారు. అయినా విద్యార్థుల స్థితి, గతి మాత్రం మారలేదన్నారు. విద్యార్థులకు ఆహారం తయారుచేయడానికి వంట గదికూడా లేని పరిస్థితి నెలకొందని వాపోయారు. నూతన భవనాన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ పరిశీలించి ప్రారంభోత్సవం చేయాలని జిల్లాస్థాయి అధికారులను ఆదేశించినా ఇప్పటివరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు స్పందించలేదన్నారు. మౌళిక వసతులు లేకపోవడంతో పాత విద్యార్థులతోపాటు నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్ధులు సైతం వేరే పాఠశాలలకు తరలి వెళుతున్నారని అన్నారు. తమ బిడ్డల పరిస్థితి ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భయపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్, అధికారులు తక్షణమే స్పందించి శిధిలావస్థ భవనం నుంచి నూతన భవనంలోకి మార్చి తమ బిడ్డల ప్రాణాలను కాపాడాలని ఆవేదన వ్యక్తంచేశారు. నాయకులు, అధికారులు స్పందించకపోతే ఈనెల 15వ తేదీ అనంతరం విద్యార్ధి సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కలక్టరేట్ ముట్టడి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు యు. మురళి, తల్లిదండ్రులు కంకిపాటి జాన్సీ, కె. భూలక్ష్మీ, పి. వెంకటేశ్వరరావు, టి.రవి, జి. రమ్య, ఐ. రజని, ఎన్. రాంబాబు, కె.రాజేష్, ఎఐఎస్ఎఫ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.