Headlines

నేను చనిపోవడానికి సిద్ధపడి రాజకీయాలు చేస్తున్నా..

లూరులోని పాత బస్టాండ్ వద్ద తన వారాహి యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను చనిపోవడానికి సిద్ధపడి రాజకీయాలు చేస్తున్నానని కుండబద్దలు కొట్టారు. మరోసారి తనని ఓడించినా సరే, జనసేన పోరాటం మాత్రం ఆగదని తేల్చి చెప్పారు. తన వెంట లక్షమంది వస్తారని కాదని, తాను ఒక్కడినే నిలబడతానని ఉద్ఘాటించారు. వైసీపీ, జగన్ అరాచకాలను ఆపాలంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సిందేనని వ్యాఖ్యానించారు. మాట్లాడితే తాను హైదరాబాద్‌లో ఉంటానని చెప్తారని, మీలాగే దోచేసిన డబ్బు తన దగ్గర లేదని పేర్కొన్నారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బులను కౌలు రైతులు ఇస్తున్నానని చెప్పారు.

సీఎం జగన్ బయటికొస్తే.. మహారాణిలా పరదాలు కట్టించుకొని తిరుగుతారని పవన్ ఆరోపించారు. ఏ ప్రభుత్వమైనా పారదర్శకత ఉండాలన్నారు. దేశంలో టిక్‌టాక్ బ్యాన్ చేస్తే, చైనాలో ఫేస్‌బుక్ బ్యాన్ చేశారని.. కానీ జగన్ మాత్రం ఇక్కడ జీవోలు కనబడకుండా చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ మూడు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు చనిపోతున్నారని.. రోడ్లు సరిగ్గా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చెత్త తొలగించే కార్మికులపై కూడా చెత్త ట్యాక్స్ వేసిన చెత్త సీఎం జగన్ అని విమర్శించారు. గెలుస్తావా? అని అందరూ తనని అడుగుతున్నారని.. గెలుస్తామా? లేదా? అనేది కాదని, పోరాటం చేయడమే లక్ష్యంగా తాను పని చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 29వేల మంది ఆడపడుచులు కనిపించకుండా.. వీళ్లపై జగన్ ఒక్క రివ్యూ కూడా పెట్టలేదని మండిపడ్డారు.