Headlines

ప్రకృతి వ్యవసాయంపై నవంబర్ 27,28 తేదీలలో గ్లోబల్ స్థాయి గుర్తింపు పొందిన శాస్త్రవేత్తల బృందం జిల్లాలో పర్యటన…

 

పుట్టపర్తి, న్యూస్ 9,నవంబర్ 26:

 

ప్రకృతి వ్యవసాయంపై

27,28 తేదీలలో గ్లోబల్ స్థాయి గుర్తింపు పొందిన శాస్త్రవేత్తల బృందం శ్రీ సత్య సాయి జిల్లాలో పర్యటన ఉంటుందని రైతు సాధికార సంస్థ విజయవాడ వారు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. శాస్త్రవేత్తలు బృందం బెంగళూరు విమానాశ్రయం నుండి సోమవారం బయలుదేరి

తొలిరోజు (27 వ తేదీన ) హిందూపురం మండలంలోని చలివెందుల గ్రామంలో పర్యటిస్తుంది. చలివెందుల గ్రామంలో తొలుత ప్రకృతి వ్యవసాయ విధానంలో కీలకంగా వినియోగించే ఘన, ద్రవ జీవామృతంలతో పాటు బీజామృతం తయారు చేసే విధానం గురించి ఏపీసీఎన్ఎఫ్ అధికారులు డెమో పద్ధతిలో బృంద సభ్యులకు వివరిస్తారు. అనంతరం కాలి నడకన గ్రామం అంతా కలియ తిరుగుతూ ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్టు ఆద్వర్యంలో సమర్థవంతంగా అమలవుతున్న “ఏ” గ్రేడ్, ఏటీఎం వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారు. మార్గమద్యంలో రసాయన వ్యవసాయ విధానంలో సాగు అవుతున్న క్షేత్రాలను కూడా సందర్శిస్తారు. అనంతరం APCNF ప్రాజెక్టు అమలులో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రకృతి వ్యవసాయంకు నాంది పలికిన విధానం, అమలు తీరు, విస్తరణ, సాధిస్తున్న ఫలితాలు, పురోగతి గురించి తెలుసుకొంటారు. రెండవ బృందం అదే రోజు పెనుగొండ మండలంలోని కోట్లపల్లి గ్రామంలో పర్యటించి ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్టు ఆద్వర్యంలో రూపొందించిన ఏటీఎం, ఏ గ్రేడ్ వంటి ఆదర్శవంతమైన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడంతో పాటు రైతు సమూహాలు, మహిళా సంఘాలు, రైతు శాస్త్రవేత్తలతో ముచ్చటిస్తారు. ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి సవివరంగా తెలుసుకొంటారు.రెండవ రోజు (28 వ తేదీన) బత్తలపల్లి మండలంలోని గంటాపురం గ్రామంలో పర్యటిస్తుంది. అక్కడ విత్తన గుళికల తయారీని డెమో ద్వారా తెలుసుకొంటుంది. ఆ తర్వాత ఏటీఎం, డ్రాట్ ప్రూఫ్ మోడల్స్ ను సందర్శించి రైతులతో ముచ్చటిస్తుంది. రైతు శాస్త్రవేత్తలు, యువ రైతులు, రైతు పారిశ్రామికవేత్తలు, మెంటార్ లు తదితర బృందాలతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయ విధానాల అమలు తీరు, విస్తరణ, మార్కెటింగ్ అవకాశాలు తదితర అంశాలపై చర్చిస్తారు.