Headlines

సమ్మెలోకి దిగిన ఏ.ఐ.టి.యు.సి. మునిసిపల్ కార్మికులు!

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జనవరి 3:

తమకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయనందునే నేటి నుండి మునిసిపల్ కార్మికులు నిరవధిక సమ్మె లోకి దిగాల్సి వచ్చిందని ఏ.ఐ.టి.యు.సి. నాయకులు స్పష్టం చేశారు.
తాడేపల్లిగూడెంలో సమ్మె చేస్తున్న మునిసిపల్ కార్మికుల సమ్మె శిబిరం వద్ద బుధవారం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు.
ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ
అమరావతిలో మంగళవారం ప్రభుత్వంతో జరిగిన సంప్రదింపులు ఫలించలేదని, దాంతో ఆరు కార్మికసంఘాల జే.ఏ.సి. ఆధ్వర్యంలో
మునిసిపల్ కార్మికులు బుధవారం నుండి సమ్మె లోకి దిగారని అన్నారు. సంప్రదింపులలో మంత్రులు గానీ, ప్రభుత్వ సలహాదారులు గానీ సమస్యల పరిష్కారానికి తగిన చొరవ చూపలేదని , ఇప్పటికే ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చినా ఇంకా సమయం కావాలనడం కాలయాపన కోసమేనని సోమసుందర్ అన్నారు.
అందుకే తాము కూడా సమ్మెలోకి దిగాల్సి వచ్చిందని అన్నారు.
ఏ.ఐ.టి.యు.సి.ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ సమానపనికి సమానవేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం, కనీసవేతనం 26 వేలు ఇవ్వాలన్న డిమాండ్ కు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయకపోవడం వల్లనే చర్చలు విఫలం అయ్యాయని అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అమరావతిలో నిన్న జరిగిన చర్చలలో పాల్గొని వచ్చిన రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ చర్చలలో జే.ఏ.సి. చేసిన డిమాండ్లకు ప్రభుత్వ పెద్దల స్పందన సవ్యంగా లేదని అన్నారు. ఎన్నికల ముందు రోడ్ షో లలో ఎన్నో హామీలు ఇస్తారని, వాటన్నిటినీ అమలు చేయాలంటే ప్రభుత్వాలకు సాధ్యం కాదని చర్చలలో ప్రభుత్వ పెద్దలు అనడం విచారకరమని అన్నారు. గత్యంతరం లేకనే సమ్మెలోకి దిగాల్సి వచ్చిందని అన్నారు.

ధర్నాకు ఎ.ఐ.టి.యు.సి. నాయకులు మందలపర్తి హరీష్ , భవననిర్మాణ కార్మికసంఘం ప్రధానకార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ , మునిసిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు తాడికొండ కనక మహాలక్ష్మి, కార్యనిర్వహక అధ్యక్షురాలు మండేల్లి జయసుధ, యూనియన్ కార్యదర్శి కే.చంద్రరావు, కోశాధికారి కే. కాటమరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి మండేల్లి సత్యనారాయణ , సహాయ కార్యదర్శి అల్లం నరేంద్ర కుమార్ ,నాయకులు యు.నాగరాజు, మండేల్లి రామకృష్ణ, రౌతు రాజేష్, ధనాల రవి, కళింగ శ్రీను, బి.శివశంకర్, లక్కవరపు శ్రీను, రమణ, బాదంపూడి శంకర్, బైపే సుబ్బారావు, కళింగపట్నం శ్రీనివాస్ , ప్రవీణ్, చేపల సావిత్రి, సత్యవతి, వరలక్ష్మి,కోటమ్మ, తదితరులు నాయకత్వం వహించారు.