Headlines

వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్నుముక..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 19:

వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్నుముక లాంటిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం జరిగిన వాలంటీర్లకు వందనం నియోజవర్గ స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాలంటీరు, సచివాలయాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన పరిపాలన వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. వాలంటీర్లకు వందనం.. అభివందనం… అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సీఎం జగన్ మానస పుత్రిక అయిన వాలంటీర్ వ్యవస్థ గురించి నేడు దేశమంతా చెప్పుకుంటుంది అన్నారు. వాలంటీర్లను ప్రతి కుటుంబం తమ కుటుంబంలో ఒక సభ్యుడుగా, ఒక సభ్యురాలుగా భావిస్తున్నారన్నారు. తిరుమల లో శ్రీవారి సేవకులు, పుట్టపర్తి సత్యసాయి బాబా సేవకులు మాదిరిగానే వాలంటీర్లు కూడా ప్రభుత్వం తరఫున ప్రజలకు స్వచ్ఛంద సేవకులు గా పని చేస్తున్నారన్నారు. వాలంటీర్లు సేవలు గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి ఏం తెలుసు అని ప్రశ్నించారు. వాలంటీర్లు అంటే ఎక్కడి నుంచి వచ్చి పడలేదని మన ఇరుగు పొరుగు వారేనని మంత్రి కొట్టు పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండడంతో ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయన్నారు. పులి కడుపున పులే పుడుతుంది అన్నట్లుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కడుపున పుట్టిన జగన్మోహన్ రెడ్డి పులిలాంటి వ్యక్తి అన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న వాలంటీరు, సచివాలయం వ్యవస్థల గురించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అమలు చేసేందుకు అధ్యయనాలు చేస్తున్నాయన్నారు. నీతి అయోగ్ వైస్ చైర్మన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న వాలంటీరు, సచివాలయ వ్యవస్థలను దేశమంతా అమలు చేయాలని కేంద్రానికి సూచించడం మనకెంతో గర్వకారణమన్నారు. మానవత్వం మంట కలిసిన కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కోవిడ్ గురించి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడంలో వాలంటీర్లు అమోఘమైన పాత్ర పోషించారని తద్వారా మన రాష్ట్రానికి ప్రపంచం లోనే గుర్తింపు వచ్చింది అన్నారు. వాలంటీర్లు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నారు. వయసులో చిన్నవారైనా వాలంటీర్లకు చేతులెత్తి దండం పెట్టాలంటూ మంత్రి కొట్టు రెండు చేతులెత్తి నమస్కరించారు. వాలంటీర్ల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అచంచలమైన నమ్మకం ఉందని, దానిని నిలబెట్టుకునే విధంగా వాలంటీర్లు పని చేయాలని ఆయన సూచించారు. వాలంటీర్లు సామాజిక కార్యకర్తలని అలాంటి వారిపై బురద జల్లితే తిరిగి అది మనకే అంటుకుంటుందన్నారు. వాలంటీర్ వ్యవస్థకు భవిష్యత్తులో మంచి వైభవం వస్తుంది అన్నారు. వాలంటీర్ల మీద అనేక అభండాలు వేసిన పవన్ కళ్యాణ్ కు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ విశిష్టత గురించి, మళ్లీ ఇదే ప్రభుత్వం వచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలతో మంత్రి కొట్టు చేతుల మీదుగా సత్కరించారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ కార్యక్రమం నిర్వాహకులుగా వ్యవహరించారు. ఇంకా ఈ సభలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పిటిసి ముత్యాల ఆంజనేయులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కరరావు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గుండుబోగుల నాగు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ కొలుకులూరి ధర్మరాజు, పెంటపాడు మండలం మహిళా ప్రెసిడెంట్, ముదునూరు సర్పంచ్ భావన ధాన్యలక్ష్మి, తాడేపల్లిగూడెం ఎంపీపీ పొనుకుమాటి శేషులత, వైస్ ఎంపీపీ సూర్పని రామకృష్ణ, బొద్దాని శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎంపీడీవో శర్మ లు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శిపర్రు సొసైటీ చైర్మన్ గుండుమోగుల సాంబయ్య, తాడేపల్లిగూడెం మండలం పార్టీ ప్రెసిడెంట్ జడ్డు హరిబాబు, కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సంపత్ రావు కృష్ణారావు, సగర కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కర్నాటి కన్నయ్య, ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గంటి చిన సర్వేశ్వరరావు, వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి దింతకుర్తి లీలావతి, టౌన్ మహిళా ప్రెసిడెంట్ బోనం విజయనిర్మల, నియోజకవర్గ మహిళా కన్వీనర్ తాడిపర్తి రజిని, ఇంకా పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు ఇన్చార్జిలు, తదితరులు పాల్గొన్నారు.