Headlines

మాతృభాషను ప్రేమిస్తే అన్యభాషలను ద్వేషించటం కాదు..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 22:

మాతృభాషను ప్రేమించడం అంటే ఇతర భాషలను ద్వేషించటం కాదని విశ్రాంత ప్రధాన అధ్యాపకుడు, భాషావేత్త, నటుడు వాడ్రేవు సుందర్రావు (తణుకు) పేర్కొన్నారు. తెలుగు సాహితీ సమాఖ్య స్వర్ణోత్సవాలలో భాగంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ముగింపు వేడుకలు స్థానిక వాసవి జూనియర్, డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించారు. సభకు సమాఖ్య అధ్యక్షుడు మండా బ్రహ్మాజీ అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి ఫైలు శ్రీనివాసరావు సభను నిర్వహించారు. సుందర రావు మాట్లాడుతూ తెలుగు భాషను అమ్మలాగ ప్రేమించాలని ఇతర భాషలలో కూడా ప్రావీణ్యం సంపాదించాలని అప్పుడే సమగ్ర అభివృద్ధిని సాధించగలమని చెప్పారు. కళాశాల అధ్యక్షుడు నారాయణ వెంకటరమణారావు జ్యోతి ప్రజ్వలన చేశారు. సభాసంచాలకులుగా విశ్రాంత ఆచార్యులు, రచయిత్రి డాక్టర్ మాడభూషి జ్యోతి కుమారి వ్యవహరించారు. బివిఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకుడు బుద్దాల వెంకట రామారావు, తగరంపూడి మురళీకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతి ప్రధానం చేశారు. గోదావరి ప్రభాకర శాస్త్రి, పూర్వాధ్యక్షుడు సూరంపూడి వెంకటరమణ, సమాఖ్య కోశాధికారి మండవల్లి చెన్న నాగేంద్రరావు , సహాయ కార్యదర్శి కొమ్మన అప్పారావు ,వాసవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మద్దాల రామకృష్ణ, పిటి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు తెలుగు భాషలో ఆసక్తికరంగా ప్రసంగించారు.