Headlines

రిమోట్ ఓటింగ్ : ఓటేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళక్కర్లేదు.

ఉపాధి నిమిత్తం సొంతూళ్ళను వదిలి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పనులు చేసుకునేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు ఎంతోమంది వుంటారు. అలాంటివారు ఎన్నికల సమయంలో స్వస్థలాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ఓ ప్రసహనం. ప్రయాణ ఖర్చులు భరించలేకపోవడం అనేది ఇక్కడ పెద్ద సమస్య. అయితే, ఇకపై సొంతూరికి వెళ్ళి ఓటెయ్యాల్సిన అవసరం లేదు. రిమోట్ ఓటింగ్ ద్వారా ఎక్కడుంటే అక్కడి నుంచే తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. కాన్సెప్ట్ నోట్ సిద్ధం.. రిమోట్ ఓటింగ్ మెషీన్‌ని తీసుకొచ్చేందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఓ కాన్సెప్ట్ నోట్ సిద్ధం చేసింది.

ఒకే పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ రిమోట్ ఈవీఎంని అభివృద్ధి చేశారు. జనవరి 16 వరకు ఈ నమూనా మిషన్ ప్రదర్శన నిమిత్తం అన్ని రాజకీయ పార్టీలనూ ఆహ్వానించారు. ఆయా రాజకీయ పార్టీలు వ్యక్తం చేసే అనుమానాలు, అభ్యంతరాలు, చేసే సూచనల్ని పరిగణనలోకి తీసుకుని, న్యాయపరమైన సాంకేతిక సమస్యలేవీ లేకుండా వుంటే.. ఆ తర్వాత దీన్ని అమల్లోకి తెస్తారు. విద్య, ఉపాధి, వివాహం తదితర కారణాలతో వేరే ప్రాంతాలకు వెళ్ళిన సుమారు 85 శాతం మంది సొంతూళ్ళలో ఓట్లు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారన్నది ఓ అంచనా.