Headlines

మూలస్థానం వెంకన్న ఇక లేరు – గ్రామాభివృద్ధిలో విశేష కృషి – 35 ఏళ్లుగా ఆయన చెప్పిన వారికే ఓట్లు

 

ఊరిని ఎలా బాగు చేయాలో నాడి పట్టి మూడున్నర దశాబ్దాలగా గ్రామాభివృద్ధికి పాటుపడిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం మాజీ సర్పంచ్, గాంధీయవాది సలాది వెంకట్రావు(వెంకన్న)(76) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆర్థిక వనరులు అంతగాలేని ఆ గ్రామాన్ని విశేష అభివృద్ధి చేశారు. ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి విషయంలో ఆయనే ముందుండేవారు. మనకెందుకులే అని వదిలేసిన దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికి వెంకన్న రేయింబవళ్ళు శ్రమించేవారు. అందుకనే ప్రజలు ఆయన్ని ఎంత వ్యతిరేకించినా ఎన్నికల సమయంలో ఓట్లు వేసి గెలిపించేవారు.ఆయన మృతి వార్త తెలిసి గ్రామస్తులు,లంక గ్రామాల ప్రజలు విచారం వ్యక్తం చేశారు.కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇంచార్జ్ బండారు సత్యానందరావు,జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావు తదితరులు వెంకన్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వెంకన్నకు ఇద్దరు కుమార్తెలు, జయప్రకాశ్ నారాయణ్(జెపి) కుమారుడు ఉన్నారు.విదేశాలలో ఉన్నత చదువు చదువుకున్న జెపి కూడా తండ్రి బాటలోనే రాజకీయాలలోకి వచ్చారు.

వెంకన్న ఎందరికో ఆదర్శం

సర్పంచిగా ఒక్కసారి గెలవడానికే ఆపసోపాలు పడిపోయే కాలం ఇది.పంచాయతీని బట్టి ఎన్నికల ఖర్చు లక్షలు కోట్ల రూపాయలు దాటి పోతున్నాయి.అలాంటిది ఓటర్లకు వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా వరుసగా ఆరు ఎన్నికలలో వెంకన్నకు లేదా ఆయన చెప్పిన వాళ్లకే ఓట్లు వేస్తున్నారు.అలాగని అదేదో వెయ్యో.. పదిహేను వందల ఓట్లున్న చిన్న గ్రామం కాదు.మొత్తం ఓటర్లు 5,563 మంది.ప్రతి ఎన్నికలలో అయిదు వందల ఓట్లు తగ్గకుండా మెజారిటీ.
1988లో సర్పంచిగా తొలిసారి పోటీ చేసి 864 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. అధ్వానంగా ఉండే ఊరిని బాగు చెయ్యడంలో విశేష కృషి చేసారు. 1995 ఎన్నికలలో సర్పంచ్ పదవి బిసి మహిళకు కేటాయించారు. అప్పుడు కుడిపూడి శారదను వెంకట్రావు పోటీలో నిలపగా 1347 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.2001లో ఒసి జనరల్ కావడంతో ఆయనే పోటీ చేసి 1046 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు.2006లో బిసి జనరల్ అయ్యింది ఇళ్ల శేషాద్రి శ్రీనివాస్ ని పోటీలో నిలిపి 678 ఓట్లు మెజారిటీతో గెలిపించారు.2013లో ఎస్సీ జనరల్ అయ్యింది. అయితే ఎంతో నమ్మకంగా ఉండే పంచాయతీలో పారిశుధ్య కార్మికరాలు యర్రంశెట్టి వెంకాయమ్మను పోటీలో నిలిపి 1310 ఓట్లు మెజారిటీతో గెలిపించారు.2021 ఎన్నికలలో కూడా ఎస్సీ లకే రిజర్వ్ అయ్యింది. ఈసారి ఎమ్ఎ చదివిన లంక వర ప్రసాద్ ను పోటీలో నిలిపారు. నామినేషన్లుకు రెండు రోజుల ముందు ప్రసాద్ ను పిలిచి పోటీ చేయాలని వెంకట్రావు ప్రతిపాదించారు. మొత్తం అయిదుగురు పోటీలో ఉండగా జనసేన అభ్యర్థిగా వెంకట్రావు పోటీచేయించిన ప్రసాద్ 776 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

• దణ్డం పెట్టకుండా ఎన్నికల ప్రచారం*

వెంకట్రావు ఎన్నికల ప్రచారం చాలా విచిత్రంగా ఉండేది. బలపర్చిన అభ్యర్థి దండం పెట్టుకుని నడుస్తుంటే పక్కన చేతులు వెనక్కి పెట్టి వెంకట్రావు ఓట్లు అడిగేతీరు ఆశ్చర్యం కల్పించేది. నేను ఇతన్ని పోటీలో నిలబెట్టాను…నామీద నమ్మకం ఉంటే ఓటు వెయ్యండి లేకపోతే మానేయండి.. అని మొహమాటం లేకుండా చెప్పడం అందర్నీ ఆశ్చర్య పరిచేది. ఏ ఓటరకు చేతులు జోడించి దణ్డం పెట్టేవారు కాదు.ప్రచారానికి కూడా ఎవరనీ పనులు మానుకుని రావద్దనేవారు.అభ్యర్థితో పాటు ఈయన ఒక్కరే తిరిగేవారు.ఓటర్లకు ఎలాంటి ప్రలోబాలు ఉండవు.కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వరు.ఎన్నికల గుర్తు తెలిడం కోసం డోర్ పోస్టర్స్ ముద్రిస్తారంతే.గత పంచాయతీ ఎన్నికలలో తక్కువ సమయం ఉన్నందున మైకు పెట్టడంతో పదివేల రూపాయలు ఖర్చు అయ్యాయి. మొత్తం 14 వార్డులలో పది వార్డులు వెంకన్న పోటీ పెట్టించిన వారినే గెలిపించారు ఆ ఊరి ప్రజలు.
మూలస్థాన అగ్రహారం వెళ్ళి వెంకన్న ఎలాంటోడని అడిగితే పిచ్చొడండి బాబూ..అని తిట్టుకుంటారు.ఎందుకంటే ఎవరికీ అనుకూలంగా చేయరు. తను చెయ్యాలనుకున్నదనే చేస్తారు.అందరికీ న్యాయం జరగాలంటారు.అందుకునే తిట్టుకున్న వాళ్లు కుడా ఓట్లేసి గెలిపిస్తారు.లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ అభిమాని.దేశంలో అవినీతిపై ఆయన చేసిన పోరాటానికి ఆకర్షితుడై వాళ్ల అబ్బాయికి జయప్రకాష్ నారాయణ అని పెట్టారు. ఎన్టీఆర్ పై అభిమానంతో పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలు సన్నగిల్లాయని పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరారు.
తన రాజకీయమంతా సైకిల్ పైనే సాగింది. తెల్లారకుండా లేచి సైకిల్ వేసుకుమను ఊరంతా తిరిగి పారిశుధ్యం,త్రాగు నీరు,వీధి లైట్లు వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేవారు.రాజకీయంగా రూపాయి ఆశించరు..పావలా పెట్టరు.అందుకునే తల్లిదండ్రుల నుంచి వచ్చిన పదిన్నర ఎకరాల భూమి పెరగలేదు. తరగలేదు.డబ్బు ఖర్చు పెట్టి గెలిస్తే వాటిని సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కాలనే వారు. అసలు సర్పంచ్ కు చెక్ పవర్ ఉండకూడదని వాదించేవారు. అంతేకాదు రెండున్నర ఏళ్ల తర్వాత సర్పంచ్ పాలన ప్రజలకు నచ్చకపోతే రీకాల్ ద్వారా తొలగించే చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.
పన్నెండో తరగతి చదివిన ఈయన భగవద్గీత, బైబిల్ కంఠస్థం చేసుకున్నారు.ఈకాలం వారికి అంతగా నచ్చని ఎన్నో మంచి విషయాలు ఈయన వివరిస్తూ ఉండేవారు.రావులపాలెం సర్పంచిగా చేసిన సఖిలేటి వాకులరాజు తన గురువని ఆయనను ఆదర్శంగా చేసుకుని గ్రామాభివృద్ధికి పాటుపడ్డానని వెంకట్రావు వివరించేవారు.మూలస్థానం గ్రామానికి హైస్కూల్, ఎలిమెంటరీ స్కూల్స్ అభివృద్ధి, రోడ్లు, డ్రెయినేజీ,కాలువ రేవులు,వాటర్ ట్యాంక్ ల సదుపాయాలు, ఇందిరా కాలనీకి వంతెనలు వంటివెన్నో అభివృద్ధి పనులకు వెంకన్న ముద్ర ఉంటుంది.ప్రస్తుత రోజుల్లో ఇటువంటి నాయకులు అత్యంత అరుదుగానే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇటువంటి వారిని ఆదర్శంగా పనిచేస్తే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలైన పల్లెలు అభివృద్ధి సాధిస్తాయి.