Headlines

వివేకా బ్రతికి ఉంటే ఆత్మహత్య చేసుకొనేవారేమో!

ఓ పక్క తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై విచారణ కొనసాగుతుండగానే, మరోపక్క సోషల్ మీడియాలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి మద్దతుగా పోస్టులు పెడుతోంది.

ఒకవేళ ఆయనే కనుక బ్రతికి ఉండి ఉంటే వాటిని చూసి ఆయన తప్పకుండా ఆత్మహత్య చేసుకొనేవారనిపిస్తుంది. అంతా దారుణంగా ఉన్నాయవి.

ఈ ప్రశ్నలకు బదులేది? అంటూ “వివేకానంద రెడ్డి తన అవసరాలు మరియు రెండో భార్య కుటుంబం కోసం ఆర్ధికంగా చితికిపోయారు. తనతోపాటు రెండవ భార్య కుటుంబం మనుగడ కోసం వివేకా తన సన్నిహిత సహచరులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తాగిరిలను ల్యాండ్ సెటిల్‌మెంట్లు, వజ్రాల వ్యాపారం చేయమన్నది నిజం కదా.” అని వివేకా ఇద్దరు భార్యలతో వారి పిల్లలతో ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది వైసీపీ.

ఇది ఖచ్చితంగా గొడ్డలి పోటే అని, అవినాష్ రెడ్డి తదితర వైసీపీ నేతలే వివేకాను హత్య చేయించారని టిడిపి మొదటి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. కానీ వివేకా గుండెపోటు, రక్తం కక్కుకొని వాంతులతో చనిపోయారనే కధతో ఈ సీరియల్ మొదలుపెట్టిన వైసీపీ ఇప్పుడు ‘గొడ్డలి పోటు’ నిజమే అని స్వయంగా నేడు ట్విట్టర్‌లో ధృవీకరించేసింది.

ఆస్తి తగాదాల కోసం హత్య, లైంగిక వేధింపుల వలన హత్య జరిగిందంటూ వాదించిన వైసీపీ తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డిపై మరో ఆరోపణ చేసింది. ఆయన రెండో కుటుంబం వలన ఆర్ధికంగా చితికిపోయారని కనుక ఈ కేసులో నిందితులను ల్యాండ్ సెటిల్‌మెంట్లు, వజ్రాల వ్యాపారం చేయమని ప్రోత్సహించారంటూ మరోసారి చనిపోయిన ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడింది.

ఒకవేళ ఆయనకు ఇన్ని అవలక్షణాలుంటే, ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్నట్లయితే మరి ఆయన చనిపోయిన తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత గొప్పగా పొగుడుతూ మాట్లాడారు? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కానీ ఈ కేసు విచారణ ముగిసేలోగా ఆయనపై వైసీపీ ఇంకెన్ని నిందలు వేస్తుందో?ఇంకెన్ని అక్రమాలు, అనైతిక సంబంధాలు అంటగడతారో?ఎవరూ ఊహించలేరు.

కానీ అవినాష్ రెడ్డిని కాపాడుకొనే ప్రయత్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే వైఎస్ కుటుంబం పరువు తీసేస్తోందని గ్రహించిన్నట్లు లేదు. అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినాష్ రెడ్డిని ఇంతగా ఎందుకు వెనకేసుకువస్తోంది?అని సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

తాజా వార్త: ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతవరకు సీబీఐ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. 25వ తేదీన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై తీర్పు చెపుతామని హైకోర్టు తెలిపింది.