Headlines

రూ.480 కోట్లతో అంబేద్కర్ స్మృతి వనం             –‘ప్రపంచానికి ఆదర్శం భారత రాజ్యాంగం—డిప్యూటీ సీఎం కొట్టు

 

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 26 :

 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడిబొడ్డున 480 కోట్ల రూపాయలు వెచ్చించి అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. తమ ప్రభుత్వానికి అంబేద్కర్ పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి డిప్యూటీ సీఎం కొట్టు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతీయులంతా గర్వించే రోజు రాజ్యాంగ దినోత్సవం అన్నారు. స్వతంత్రం సిద్ధించాక మేధావులంతా కూర్చుని సార్వభౌమత్వాన్ని, సౌబ్రాతృత్వాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా రాజ్యాంగం రచించాలని కాన్షిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేశారన్నారు. ప్రపంచ మేధావిగా కొనియాడబడిన మహా జ్ఞాని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు ఆ బాధ్యత అప్పగించడం జరిగింది అన్నారు. సరిగ్గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయే విధంగా అత్యంత సమగ్రంగా భారత రాజ్యాంగాన్ని రచించి సమర్పించారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థగా మన భారతదేశం ప్రఖ్యాతి సాధించడానికి అంబేద్కర్ రాజ్యాంగం మూల స్తంభం వంటిది అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భారతదేశం లోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. 125 అడుగులు ఎత్తు గల అంబేద్కర్ విగ్రహం దాని కింద మరో 80 అడుగులు పీఠంతో మొత్తం 205 అడుగులు ఎత్తున భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 480 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టిన దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంతో కూడిన ఈ అంబేద్కర్ స్మృతి వనం పనులు పూర్తి కావచ్చాయన్నారు. త్వరలోనే దీనిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందన్నారు. 2014లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు చంద్రబాబు కేటాయించిన 5 ఎకరాలు భూమి ప్రస్తుతం తుమ్మ చెట్లు, బ్రహ్మజెముడు చెట్లతో నిరుపయోగంగా ఉంది తప్ప అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు తెలుగుదేశం హయాంలో ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు. కానీ వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం విజయవాడ నగరానికి నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రదేశంలో దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో 480 కోట్లు వెచ్చించి అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారని, అంబేద్కర్ పట్ల తమకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు తమ ప్రభుత్వం అర్పించే నిజమైన నివాళి ఇది అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లు కర్రి భాస్కరరావు, బొడ్డు సాయి బాబా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తెన్నేటి జగ్జీవన్, దృశ్యకళల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మానికొండ వెంకటేశ్వరరావు, సగర కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కర్నాటి కన్నయ్య, యూత్ లీడర్ కొట్టు విశాల్, మాజీ కౌన్సిలర్లు మేడపాటి జనార్దన్ రెడ్డి, మేడపాటి చెల్లారెడ్డి, పచ్చమట్ల సావిత్రి, సింగం సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్, వార్డు ఇన్చార్జిలు బోలెమ్ రమణ, శానం రామకృష్ణ, పూడి ప్రసాద్, వట్టి బుజ్జి, మిద్దె ఆదినారాయణ, నీరుకొండ పండు, చామన సూర్యచంద్రరావు, కోడె సత్య శ్రీనివాస్, అశోక్, ప్రసాద్, మారిశెట్టి రమణ, ఇంకా పలువురు వార్డు ఇన్చార్జిలు పాల్గొన్నారు.