Headlines

జనవరి 18న యాదాద్రికి ముగ్గురు ముఖ్యమంత్రులు

జనవరి 18న ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పలువురు సీఎంలు హాజరవుతారని ప్రకటించిన గులాబీ పార్టీ… మరో ముఖ్య అప్డేట్ ఇచ్చింది. ఖమ్మం సభకు హాజరయ్యేందుకు వచ్చే సీఎంలతో కలిసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నర్సింహ్మ స్వామిని దర్శించుకోనున్నారు. వారితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం… యాదాద్రి నుంచి ఖమ్మం చేరుకోనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. జనవరి 18న ఉదయం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ వారితో పాటు పలువురు జాతీయ నేతలతో చర్చలు జరుపుతారు. అనంతరం… ఇద్దరు సీఎంలు, పలువురు జాతీయ నేతలతో కలిసి సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో ఉదయం 11 : 30 గంటలకు యాదాద్రికి చేరుకోనున్నారు. ముగ్గురు సీఎంలు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 12 : 30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి నుంచి బయలుదేరి ఖమ్మం చేరుకోనున్నారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత ఖమ్మం కలెక్టరేట్ లో రెండవ విడత కంటి వెలుగు ప్రారంభిస్తారు.

మధ్యాహ్న భోజనం తర్వాత.. ఖమ్మం సభలో పాల్గొననున్నారు. సభ తర్వాత కేజ్రీవాల్, విజయన్ విజయవాడ వెళ్లనున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత నిర్వహిస్తోన్న తొలి సభ కావటంతో…. ఖమ్మం బహిరంగ సభను గులాబీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వంద ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 20 పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తున్నారు. సభకు వచ్చే వారికి సహాయం కోసం వెయ్యి మంది వాలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జి లను నియమించి జన సమీకరణ చేస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర నుంచి జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్య అతిథులతో పాటు ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు వేదికపై ఉంటారని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. కళా కారులకు ప్రత్యేక వేదిక ఉంటుంది.. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు సహా జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.